ఛార్జర్స్ కు మంత్రి అల్టిమేటమ్ హైదరాబాద్ : ఐపీఎల్ మ్యా చ్ లను హైదరాబాద్ లో నిర్వహించకపోతే డెక్కన్ చార్జర్స్ ను టోర్నీ లో ఆడనివ్వబోమని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఐపీఎల్ -3 టోర్నీని ఛార్జర్స్ జట్టు బహిష్కరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లను జరపాలని ఆయన డిమాండ్ చేసారు. ఐపీఎల్ ప్రారంభ ఉత్సవాలను హైదరాబాద్ లో నిర్వహించాలంటూ కేంద్ర మంత్రి శరాద్ పవార్ కు ఇప్పటికే లేఖ రాసిన కొమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ మ్యాచ్ లను రాష్ట్రంలో నిర్వహించకపోతే క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతారని ఆయన అన్నారు. అయితే టోర్నీలో తమను ఆడనివ్వబోమన్న మంత్రి ప్రకటన చూశాకే తాము స్పందిస్తామని డెక్కన్ చార్జర్స్ వెల్లడించింది.
ఆంధ్రరాష్ట్రంలో నెలకొన్న ఉద్యమాల కారణంగా ఐపీఎల్ ప్రారంభ ఉత్సవాల వేదికను హైదరాబాద్ నుండి ముంబయికి మార్చామని ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ వెల్లడించారు. మార్చి11న ప్రారంభ ఉత్సవాలు, 12 న టోర్నీ ప్రారంభ మ్యాచ్ ల నిర్వహణను తాము అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామన్నారు. ప్రపంచదేశాల నుంచి అనేకమంది ప్రముఖులు ప్రతినిధులుగా ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు హాజరువుతున్నందున ఉత్సవాలు సక్రమంగా నిర్వహించాలని నిర్ణయించామని మోడీ చెప్పారు. డెక్కన్ ఛార్జర్స్- కోలకతా నైట్ రైడర్స్ ల మధ్య టోర్నీ ప్రారంభ మ్యాచ్ ముంబయిలోనే జరుగుతుందని వివరించారు. ఏర్పాట్లన్నీ సవ్యంగా సాగుతున్నాయని, ఈ అంశంపై మరో ఆలోచన చేసే యోచన లేదని మోడీ స్పష్టం చేసారు.
News Posted: 10 February, 2010
|