ఒలంపిక్స్ లో క్రికెట్ వాంకోవర్ : ఒలంపిక్స్ క్రీడల్లో ఎట్టకేలకు క్రికెట్ కు స్థానం లభించింది. ఒలంపిక్స్ క్రీడల్లో క్రికెట్ ను కూడా చేర్చాలని ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ కౌన్సిల్(ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)ని ఐఓసీ గుర్తింపునిస్తున్నట్లు ప్రకటించింది. వాంకోవర్ లో శుక్రవారం శీతాకాల ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇక్కడ సమావేశమైన ఒలంపిక్స్ కౌన్సిల్ క్రికెట్ క్రీడను ఒలంపిక్స్ చేర్చేందుకు తన ఆమోదాన్ని తెలిపింది. క్రికెట్ తో పాటుగా పవర్ బోటింగ్, క్లైంబింగ్ క్రీడలకు కూడా ఆమోదం తెలిపినట్లు ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ కౌన్సిల్ డైరక్టర్ మార్క్ అడమ్స్ వెల్లడించారు. తాము తీసుకున్న నిర్ణయంతో ఒలంపిక్స్ క్రీడల్లో క్రికెట్ చేరిందని ఆయన వివరించారు. ఒలంపిక్ క్రీడగా క్రికెట్ ను 2007 లో గుర్తించినప్పటికీ, తగివ మార్గదర్శకాలు రూపొందించనందున అప్పట్లో ఐఓసీ తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది. ఇప్పుడు క్రికెట్ కు ఒలంపిక్ క్రీడల్లో చేరుస్తూ, ఐసీసీకి గుర్తింపునిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది.
ఐఓసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్రికెట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లార్గాట్ స్వాగతించారు. ఐసీసీని గుర్తించడం ద్వారా ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేరుస్తుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. ఐఓసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్రికెట్ మాజీ ఆటగాళ్లు అడమ్ గిలక్రిస్ట్, స్టీవ్ వా, స్టీఫెన్ ప్లేమింగ్, కుమార సంగక్కర, సొరవ్ గంగూలీ, వి వి ఎస్ లక్ష్మణ్ లు కూడా తమ సంతోషం వ్యక్తం చేసారు.
అయితే ఒలంపిక్ లో ఏ తరహా క్రికెట్ ను ప్రవేశపెడతారన్ని విషయాన్ని ఐఓసీ స్పష్టం చేయలేదు. సీనియర్ ఆటగాళ్లు మాత్రం ట్వంటీ20 విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. 1990లో పారిస్ లో జరిగిన ఒలంపిక్స్ క్రీడల్లో క్రికెట్ ను చేర్చారు. ఆ తరువాత జరిగిన ఒలంపిక్ క్రీడల్లో క్రికెట్ లేకుండా పోయింది. 1998లో కౌలాలంపూర్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కు చోటు కల్పించారు. ఈ ఏడాది చైనా లో జరిగే ఆసియా క్రీడల్లో ట్వంటీ20 క్రికెట్ ను ప్రవేశపెడుతున్నారు.
News Posted: 12 February, 2010
|