అమెరికాలో ఐపీఎల్..! ముంబయి : అమెరికాలోనూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇండియా తరహాలో అమెరికాలో కూడా ట్వంటీ20 ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసేందుకు ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన యూఎస్ఎ క్రికెట్ సీఈఓ డానాల్డ్ లాకర్బీతో దుబాయ్ లో సమావేశమయ్యారు. క్రికెట్ అవసరమైన స్టేడియంలు, ఇతర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. అంతేగాక అమెరికాలో క్రికెట్ కు విశేష ఆదరణ లభించేలా చేసేందుకు వ్యూహాత్మక వైఖరి అవలంబించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ మేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్, యూ ఎస్ ఎ క్రికెట్ లు సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిశ్చయించారు.
2010 మే నెల నాటికి ఐపీఎల్ లో అమెరికన్లు పాల్గొనేలా రంగం సిద్ధం చేయాలని బావిస్తున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మన్ లలిత్ మోడీ తెలిపారు. నార్త్ అమెరికాలో క్రికెట్ కు విశేష ఆదరణ ఉందని అక్కడ ఐపీఎల్ ను ప్రొత్సహించాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.యుఎస్ఎ క్రికెట్ సీఈఓ డొనాల్డ్ లాకర్బీ మాట్లాడుతూ, అమెరికా క్రీడా రంగంలో ఐపీఎల్ కు మంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయని చెప్పారు. క్రికెట్ క్రీడను ప్రోత్సహించేందుకు నార్త్ కరోలినా వర్శిటీ ప్రాంగణంలో తాను శిక్షణ కూడా ఇస్తున్నట్లు చెప్పారు.
News Posted: 12 February, 2010
|