వీరూ సెంచరీ
కోల్ కతా : దక్షిణాఫ్రికాతో ఇక్కడి ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు సోమవారంనాడు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేశాడు. సౌతాఫ్రికాపై వీరూకి ఇది ఐదో సెంచరీ కాగా ఈ సీరీస్ లో రెండో సెంచరీ. మధ్యాహ్నం 2.30 గంటలకు వీరు 129 పరుగులతోను, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అర్ధ సెంచరీ దాటి 69 పరుగులతోనూ క్రీజ్ వద్ద నిలకడగా ఆడుతున్నారు. అంతకు ముందు మరో ఓపెనర్ గౌతం గంభీర్ 25 పరుగులలకు, వన్ డౌన్ మురళీ విజయ్ 7 పరుగులకు ఔటయ్యారు. క్రీజ్ వద్ద ఉన్న సీనియర్లిద్దరూ క్రికెట్ లో తమ నైపుణ్యాన్ని అంతటినీ రంగరించి దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఎదుర్కొంటున్నారు.
అంతకు ముందు ఆదివారం ఉదయం టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా సోమవారం ఉదయం 296 పరుగులు చేసిన అనంతరం ఆలౌట్ అయింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 226 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో సోమవారం బరిలో దిగిన దక్షిణాఫ్రికా మరో 70 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమి స్మిత్ 4, అల్విరో పీటర్సన్ 100, హషిం ఆమ్ల 114, జాక్విస్ కల్లిస్ 10, ఎబి డి విల్లియర్స్ 12, ఆష్వెల్ ప్రిన్స్ 1, జెపి డుమిని 0, డేల్ స్టేన్ 5, పాల్ హారిస్ 1, వేన్ పార్నెల్ 12 పరుగులు చేయగా, మోర్న్ మార్కెల్ 11 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
భారత బౌలింగ్ లో జహీర్ ఖాన్ 4 దక్షిణాఫ్రికా వికెట్లను పడగొట్టాడు. హర్భజన్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రాలకు ఒక్కొక్క వికెట్ దొరికింది. విల్లియర్స్ ను జహీర్ ఖాన్ రన్నౌట్ చేశాడు.
News Posted: 15 February, 2010
|