భారత్ 643/6 డిక్లేర్డ్ కోల్ కతా : ఆరు వికెట్ల నష్టపోయి 643 పరుగుల వద్ద భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీనితో దక్షిణాఫ్రికా కంటే భారత్ 347 పరుగుల ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికాతో ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు మంగళవారం ఇంకా 13 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా కెప్టెన్ తమ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. స్టైలిష్ బ్యాట్స్ మన్ లక్ష్మణ్ 143, కెప్టెన్ ధోనీ 132 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మెన్ గా ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ 259 పరుగుల భాగస్వామ్యం సాధించారు.
వికెట్ల వద్ద లక్ష్మణ్ నిలదొక్కుకొని కాస్త నిదానంగానే సెంచరీ సాధించాడు. అయితే, ధోనీ మాత్రం దక్షిణాఫ్రికా బౌలింగ్ పై చెలరేగి ఆడాడు. 70.59 స్ట్రయిక్ రేట్ తో ఆడిన ధోనీ 3 సిక్సర్లు, 12 బౌండరీలతో 132 పరుగులు చేయగా, 260 బంతులు ఎదుర్కొన్న లక్ష్మణ్ 16 బౌండరీలతో 143 పరుగులు చేశాడు. లక్ష్మణ్ స్ట్రయిక్ రేట్ 55గా ఉంది. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ 25, వీరేంద్ర సెహ్వాగ్ 165, మురళీ విజయ్ 7, సచిన్ టెండుల్కర్ 106, ఎస్. బద్రీనాథ్ 1, అమిత్ మిశ్రా 28 పరుగులు చేశారు. మొత్తం 36 ఎగ్ స్ట్రా పరుగులను దక్షిణాఫ్రికా బౌలర్లు ఇచ్చారు. మొత్తం మీద భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను ఆరు వికెట్లు నష్టపోయి 643 పరుగులకు డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు టీమిండియా కెప్టెన్ ఆహ్వానించాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్ లో మోర్న్ మోర్కెల్ 2 వికెట్లు పడగొట్టగా, డేల్ స్టేయిన్, పాల్ హారిస్, జె.పి. డుమిని తలో వికెట్ తీసుకున్నారు.
News Posted: 16 February, 2010
|