ఏదీ ఆ ఘోష... ఈడెన్? కోల్ కతా : సముద్ర ఘోషను తలపించే హోరు... క్రిక్కిరిసిపోయే జనం. క్రికెట్ స్వర్గధామంగా కీర్తిని ఆర్జించిన ఈడెన్ గార్డెన్స్... ఇవన్నీ ఏమయ్యాయి. క్రికెట్ పండితులుగా, ప్రేమికులుగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన ఈడెన్ అభిమానులు ఏమయ్యారు. వారు కనిపించడం లేదు. బ్యాట్స్ మెన్లు సెంచరీల మీద సెంచరీలు బాదుతుండే తమకే స్వంతమైన హర్షాద్వానాలతో, కేరింతలో ఆనందించే కోల్ కతా వాసుల జాడే లేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా- భారత్ ల మధ్య సాగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ను చూడటానికి ఈడెన్ చరిత్రలోనే అతి తక్కువ మంది ప్రేక్షకులు హజరయ్యారు. భారత క్రికెట్ దేవుడు సచిన్ సెంచరీ చేసినా, వీర బాదుడు వీరూ, ధనాధన్ దోనీ, మణికట్టు మాయాజాలంతో సొగసరి వెరీ వెరీ స్పెషల్ లక్షణ్ శతకాలతో అలరించినా అభినందించే అభిమానులు తక్కువై పోయారు. చప్పట్లతో హోరెత్తిపోయే ఈడెన్ దృశ్యాలే మారిపోయాయి.
వాస్తవానికి ఈడెన్ గార్డెన్ లో 90 వేల మంది ప్రేక్షకులు క్రికెట్ ను తిలకించే అవకాశం ఉంది. కాని ఈ సారి సగం స్టాండ్స్ ను కూలగొట్టేశారు. రాబోయే వరల్డ్ కప్ మ్యాచ్ లను గురించి వాటిని ఆధునీకరిస్తున్నారు. మిగిలిన స్టాండ్స్ లో 40 వేల మంది కూర్చోవచ్చు. కానీ గడచిన మూడు రోజులూ ఈ స్టాండ్ లు సగానికి సగం ఖాళీగానే కనిపించాయి. స్టేడియం వెలవెలపోయింది. చప్పట్లు పేలవంగానే వినిపించాయి. చారిత్రిక ఈడెన్ లో 76 సంవత్సరాల క్రితం తొలి టెస్ట్ మ్యాచ్ 1934లో జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ జట్టుకు డగ్లస్ జార్డైన్, భారత జట్టుకు సికె నాయుడు సారధ్యం వహించారు. అప్పటి నుంచీ క్రికెట్ ప్రపంచానికి ఈడెన్ ప్రేక్షకుల స్వర్గంగా పేరుపొందింది.
వన్ డే క్రికెట్ మరీ పొట్టిదైపోయి ట్వంటీ20గా మారిన తరువాత టెస్ట్ క్రికెట్ పై మోజు తగ్గిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. అయిన క్రితంసారి 2007 లో పాకిస్తాన్- ఇండియా టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా దాదాపు 40 వేల మంది హజరయ్యారని, ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య ఇరవై వేలకు పడిపోయిందని వారు వివరించారు. కానీ మొన్నటి నాగ్ పూర్ మ్యాచ్ కు కనీసం వెయ్యిమంది కూడా రాలేదని, అక్కడి కంటే ఇప్పటికీ కోల్ కతా ఈడెన్ నయమని వారు సంతృప్తి పడుతున్నారు.
News Posted: 16 February, 2010
|