నంబర్ వన్ కు ఎసరు? కోల్ కతా : టెస్టుల్లో భారత్ నెంబర్ వన్ స్థానానికి ఎసరొచ్చేటట్లుంది. ఇక్కడి ఈడెన్ గార్డెన్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు బుధవారంనాటి ఆట వర్షం, వెలుతురు సరిగా లేని కారణంగా అర్ధంతరంగా ఆగిపోయింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి, నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకున్న టీమిండియా ఆశలపై వానదేవుడు నీళ్ళు చల్లాడు. వర్షం, వెలుతురు సరిగా లేని కారణంగా నాలుగో రోజు మిగిలిన ఆటను రద్దుచేసినట్లు అంపైర్లు ప్రకటించారు. అంపైర్ల నిర్ణయంతో దక్షిణాఫ్రికాకు ఊరట లభించినట్లైంది. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 347 పరుగులు వెనుకబడి కష్టాల్లో ఎదురీదుతున్న సమయంలో వరుణదేవుడు వారి పక్షాన నిలిచినట్లైంది. నాలుగో రోజు ఆట వర్షార్పణం అయ్యే సరికి దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ లోని మూడు కీలక వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. హషిం ఆమ్ల 49 పరుగులతోను, ఆష్వెల్ ప్రిన్స్ పరుగులేవీ చేయకుండా పెవిలియన్ వద్ద ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లోని పరుగుల లోటును పూడ్చుకోవడానికి దక్షిణాఫ్రికా ఇంకా 232 పరుగులు చేయాల్సి ఉంది.
మంగళవారం రాత్రి కోల్ కతాలో కురిసిన వర్షం కారణంగా ఈడెన్ గార్డెన్ మైదానం చిత్తడి చిత్తడిగా తయారైంది. దీనితో నాలుగో రోజు ఆట గంటన్నర ఆలశ్యంగా ఉదయం 10.30 ప్రారంభమైంది. దానికి తోడు మధ్య మధ్యలో వర్షం పలుకరిస్తుండడంతో పలుమార్లు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో ఆట ముగిసే సమయానికి కేవలం 34.1 ఓవర్లు మాత్రమే పూర్తయ్యాయి. దక్షిణాఫ్రికా కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గ్రేమి స్మిత్ ను 20 పరుగులకే అమిత్ మిశ్రా ఎల్ బిడబ్ల్యుగా పెవిలియన్ కు పంపించాడు. టూ డౌన్ జాక్విస్ కల్లిస్ వికెట్ కూడా మిశ్రాకే దొరికింది. 47 బంతులు ఎదుర్కొని 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసిన కల్లిస్ మిశ్రా బంతిని వికెట్ల వెనుక కాసుక్కూర్చున్న ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనింగ్ బ్యాట్స్ మన్ అల్విరో పీటర్సన్ కు హర్భజన్ సింగ్ పెవిలియన్ దారి చూపించాడు.
ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యే పక్షంలో 1-0 ఆధిక్యంతో సీరీస్ దక్షిణాఫ్రికా వశమవుతుంది. దీనితో టెస్ట్ ల్లో నెంబర్ వన్ స్థానాన్ని భారత్ నుంచి రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. భారత్ లో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా నాగపూర్ జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 6 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. కోల్ కతా టెస్ట్ ను గెలిచి సీరీస్ సమం చేయడం ద్వారా టాప్ ర్యాంక్ ను నిలబెట్టుకోవాలన్న భారత జట్టుకు ఆటగాళ్ళకు చివరికి ఆశాభంగమే ఎదురయ్యేట్టు కనిపిస్తోంది. అయితే, గురువారం ఐదో రోజు ఆటకైనా వాన అడ్డంకి లేకుండా ఉండి, 232 పరుగులు చేయకుండానే దక్షిణాప్రికాను భారత్ ఆలౌట్ చేయగలిగితే సీరీస్ సమం అయ్యే అవకాశాలున్నాయి. కాగా, కోల్ కతాలో వాతావరణం అందుకు సహకరిస్తుందా అన్నది అనుమానమే.
News Posted: 17 February, 2010
|