మనమే నెంబర్ వన్
కోల్ కతా : టెస్ట్ క్రికెట్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానాన్ని చెమటోడ్చి మరీ నిలబెట్టుకుంది. ఈడెన్ గార్డెన్ లో గురువారం దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్ ను భారత్ ఇన్నింగ్స్ 58 పరుగుల భారీ ఆధిక్యంతో గెలుచుకుంది. దీనితో దక్షిణాఫ్రికా భారత పర్యటనలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్ ల సీరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. మ్యాచ్ ను గెలిచే అవకాశం కనిపించకపోవడంతో ఎలాగైనా డ్రా చేసి సీరీస్ ను, టాప్ వన్ స్థానాన్ని ఎత్తుకుపోవాలని దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ చివరి నిమిషం వరకూ చేసిన యత్నాలను టీమిండియా కొనసాగనివ్వలేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ 73 బంతుల్లో 14, 100 బంతుల్లో 19 పరుగులు, 114 బంతుల్లో 20, 124 బంతుల్లో 25 పరుగులు ఇలా జిడ్డాట కొనసాగించారు. అయినప్పటికీ హర్భజన్ సింగ్ స్పిన్ మాయాజాలానికి దక్షిణాఫ్రికా ఐదు వికెట్లను అప్పగించుకొంది. ఒకే ఒక్కడు అన్నట్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లో హషిం ఆమ్ల ఒక్కడు మాత్రమే భారత బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. వికెట్ల వద్ద పాతుకుపోయి టీమిండియా సహనానికి పరీక్ష పెట్టాడు. అమిత్ మిశ్రా 3 వికెట్లు, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీసి భారత్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.
రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజున టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 296 పరుగులకు ఆలౌట్ అయింది. పీటర్సన్, ఆమ్ల సెంచరీలు చేశారు. సమాధానంగా బరిలో దిగిన భారత్ ఆరు వికెట్లు నష్టపోయి 643 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 165, టెండుల్కర్ 106, లక్ష్మణ్ 143, కెప్టెన్ ధోనీ 132 నాటౌట్ సెంచరీలు చేశారు.
తొలి ఇన్నింగ్స్ లో 347 పరుగులతో వెనుకబడి ఉన్న దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 289 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్మిత్ 20, పీటర్సన్ 21, ఆమ్ల 127 నాటౌట్, కల్లిస్ 20, ప్రిన్స్ 23, విల్లియర్స్ 3, డుమిని 6, డేల్ స్టేయిన్ 1, పార్నెల్ 22, హారిస్ 4, మోర్కెల్ 12 పరుగులు చేశారు.
కాగా, ఈ సీరీస్ లో ఆడిన మూడు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేసిన హషిం ఆమ్ల ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ ఆవార్డులు అందుకున్నాడు. రెండో టెస్ట్ మ్యాచ్ లో అత్యధికంగా 259 పలుగుల భాగస్వామ్యం సాధించిన టీమిండియా బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ - కెప్టెన్ ధోనీ 50 వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు.
News Posted: 18 February, 2010
|