ఎన్నెన్ని అడ్డంకులో..! కోల్ కతా : ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొనాల్సి వచ్చింది. కోల్ కతా టెస్ట్ ను టీమిండియా గెలుస్తుందా? నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా అని భారత క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురు చూసిన వారికి చిట్టచివరికి శుభవార్తే అందింది.
దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా నిర్వహించిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లోని నాగపూర్ తొలి మ్యాచ్ ను ఇన్నింగ్స్ 6 పరుగుల తేడాతో జారవిడుచుకున్న భారత్ రెండో మ్యాచ్ ఎలాగైనా గెలుకోవాల్సిన డిఫెన్స్ లో పడిపోయింది. ఈ క్రమంలో కోల్ కతా లో గురువారంతో ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్ ఓడినా, కనీసం డ్రా అయినా టీమిండియా ఈ సీరీస్ ను, నెంబర్ వన్ స్థానాన్ని కూడా దక్షిణాఫ్రికా చేతికి వెండిపళ్ళెంలో పెట్టి అందజేసినట్లయ్యేది. భారత బ్యాట్స్ మెన్, బౌలర్లు, ఫీల్డర్లు శ్రమించి, చెమటోడ్చి కోల్ కతా టెస్ట్ మ్యాచ్ ను గెలిచేందుకు కృషి చేశారు.
తొలి ఇన్నింగ్స్ లో 347 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా డిక్లేర్ చేసి దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్ కు ఆహ్వానించింది. ఆట నాలుగో రోజు బుధవారంనాడు టెస్ట్ పై భారత్ పట్టు బిగించిన సమయంలో వరుణుడు ఆటంకం కలిగించాడు. మంగళవారం రాత్రికే కోల్ కతాలో వర్షం కురవడంతో ఈడెన్ గార్డెన్ ఔట్ ఫీల్డ్ చిత్తడి చిత్తడిగా మారిపోయింది. దీనితో నాలుగో రోజు ఆట ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా గంటన్నర ఆలస్యంగా 10.30 మొదలైంది. అయినా వరుణదేవుడికి తృప్తి కలగలేనట్లు మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తూ అల్లరిపెట్టాడు. ఒక పక్క వర్షం, మరో పక్క వెలుతురు సరిగా లేకపోవడంతో బుధవారంనాటి ఆటను జరగాల్సిన మ్యాచ్ ను అంపైర్లు మధ్యలోనే నిలిపివేశారు. అప్పటికి కేవలం మూడు దక్షిణాఫ్రికా వికెట్లను మాత్రమే భారత్ తీయగలిగింది.
విజయం సాధించాలన్నా, సీరీస్ సమం చేయాలన్నా, టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న మరో ఏడు వికెట్లను ఒక్క గురువారం నాడే తీయాల్సిన పరిస్థితి భారత్ కు ఎదురైంది. దానికి తోడు గురువారం కూడా కోల్ కతాలో వర్షం ఆటంకాలు సృష్టించే ప్రమాదం తప్పకపోవచ్చన్న భయాలు కూడా టీమిండియాను వెంటాడాయి. అయితే, వర్షం, వెలుతురు సహకరించినప్పటికీ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిం ఆమ్ల భారత విజయానికి సైంధవుడిలా అడ్డుపడుతూ చికాకు పరిచాడు. టూ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఆమ్ల మొత్తం 394 బంతులు ఎదుర్కొని 123 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒక పక్కన తనకు రెండో ఎండ్ లో తోడుగా వచ్చిన బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కు వెళ్ళిపోతున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా వికెట్ల వద్దే పాతుకుపోయాడు. టెయిలెండర్లతో కూడా సమన్వయంతో వికెట్లను రక్షించుకుంటూ భారత బౌలర్లు, ఫీల్డర్లను కూడా ముప్పు తిప్పలు పెట్టాడు. మరో నాలుగు ఓవర్లు అలాగే దక్షిణాఫ్రికా బ్యాట్స్ ఆడి ఉంటే మ్యాచ్ డ్రా అయిపోయేది. సీరీస్ దక్షిణాఫ్రికా వశమయ్యేది. అంతకన్నా ముఖ్యంగా ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం ఎగరేసుకుపోయి ఉండేది. చిట్టచివరి వికెట్ మోర్కెలో కూడా 76 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు చేయడం సౌతాఫ్రికా జట్టు వ్యూహంలో భాగమే. అంతకు ముందు ఔటైన హారిస్ కూడా 36 బంతులు ఆడి కేవలం 4 పరుగులు చేయడం కూడా అదే వ్యూహం.
ఏమైతేనేం చివరికి భారత్ తన స్థానాన్ని పదిల పరచుకోవడంతో భారత క్రికెట్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
News Posted: 18 February, 2010
|