భారత్ ఖాతాలో తొలి వన్డే
జైపూర్ : దక్షిణాఫ్రికా జట్టుతో నువ్వా నేనా అనే విధంగా ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఐసిసి ర్యాంకింగ్స్ లో రెండో స్థానం కోసమే అన్నట్లు ఇరు జట్ల మధ్య సాగుతున్న ఈ సీరీస్ పోరులో తొలి బోణీని టీమిండియా చేసింది. పది ఓవర్లు బంతులు వేసి అతి తక్కువగా 29 పరుగులు మాత్రమే ఇచ్చి హెర్చెల్లా గిబ్స్, డి విల్లియర్స్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేయడమే కాకుండా 20 బంతుల్లో 22 పరుగులు చేసి ఆలౌరౌండ్ ప్రతిభ కనబరిచిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అభినందనలు అందుకున్నాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు ఆహ్వానం పొందిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసిన ధోనీ సేన దక్షిణాఫ్రికాను 297 పరుగులకే ఆలౌట్ చేసింది. దీనితో భారత్ ఈ సీరీస్ లో 1 - 0 ఆధిక్యంతో ముందుంది. టెస్ట్ మ్యాచ్ సీరీస్ ను సమం చేయడమే కాకుండా ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్న ఉత్సాహంతో టీమిండియా జైపూర్ వన్డేలో కదం తొక్కింది.
స్కోరు వివరాలు :
భారత్ : వీరేంద్ర సెహ్వాగ్ 46, సచిన్ టెండుల్కర్ 4, దినేష్ కార్తీక్ 44, దోనీ 26, విరాట్ కొహ్లీ 31, సురేష్ రైనా 58, యూసఫ్ పఠాన్ 18, రవీంద్ర జడేజా 22, ప్రవీణ్ కుమార్ 13, ఆశిష్ నెహ్రా 16 నాటౌట్, ఎస్.శ్రీశాంత్ 0 నాటౌట్.
దక్షిణాఫ్రికా : లూట్స్ బోస్మన్ 29, హెర్చెల్లె గిబ్స్ 27, జాక్విస్ కల్లిస్ 89, ఎవి డి విల్లియర్స్ 25, అల్విరో పీటర్సన్ 9, అల్బీ మోర్కెల్ 2, మార్క్ బౌచర్ 5, జాన్ బోథా 10, వేయిన్ పార్నెల్ 49, డేల్ స్టేయిన్ 35, చార్లీ లాంగ్వెల్ట్ 4 నాటౌట్.
బౌలింగ్ :
దక్షిణాఫ్రికా : జాక్విస్ కల్లిస్ 3, వేయిన్ పార్నెల్, చార్లీ లాంగ్వెల్ట్, అల్బీ మోర్కెల్ తలో వికెట్ పడగొట్టారు.
భారత్ : ప్రవీణ్ కుమార్, ఎస్. శ్రీశాంత్, రవీంద్ర జడేజా తలో రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆశిష్ నెహ్రా, యూసఫ్ పఠాన చెరో వికెట్ పడగొట్టారు.
News Posted: 21 February, 2010
|