పరల్డ్ కప్ వేదిక మార్పు? మెల్ బోర్న్ : తీవ్రవాదులు దాడులు చేస్తారనే భయం పట్టుకోవడంతో ఐపిఎల్ లో ఉన్న విదేశీ క్రికెటర్లను ఆయా దేశాలు వెనక్కి పిలుస్తున్నాయి. దాంతో వచ్చే ఏడాది భారత్ లో జరగాల్సిన వరల్డ్ కప్ టోర్నీ వేదికను ఆస్ట్రేలియాకు గాని న్యూజిలాండ్ కు గాని మార్చాలని యోచిస్తున్నారు. అయితే వరల్డ్ కప్ మ్యాచ్ లను భారత్ లోనే నిర్వహించడానికి తాము చేయవలసిన అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నామని ఐసిసి కార్యనిర్వాహక అధికారి హరూన్ లార్గట్ సోమవారం నాడు చెప్పారు.
తీవ్రవాద భయం కారణంగా వరల్డ్ కప్ టోర్నీ న్యూజిలాండ్ కు గాని అస్ట్రేలియాకు గాని తరలించే అవకాశం ఉందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సిఇవో జస్టిన్ వాగన్ చెప్పారు. వరల్డ్ కప్ టోర్నీ సమయాలను మార్చలేమని, గట్టి భద్రత ఏర్పాటు చేస్తే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ఒకవేళ ఏదైనా జరిగితే క్రికెట్ మనుగడకే ముప్పువాటిల్ల వచ్చని ఆయన అన్నారు. దీనికి పరిష్కారం చూడాల్సిందేనన్నారు. తీవ్రవాదం కారణంగా క్రికెట్ దెబ్బతినడాన్ని తాము అంగీకరించబోమని, పాకిస్తాన్ లో అదే జరిగిందని ఆయన వివరించారు. క్రికెట్ కు సంబంధించినంత వరకూ వరల్డ్ కప్ చాలా పెద్ద వ్యవహారమని, అది జరిగితీరాలని లార్గట్ అన్నారు. భద్రతకు సంబంధించి అన్ని దేశాల పరిస్థితులను చాలా కూలంకషంగా పరిశీలిస్తున్నామన్నారు. ఆటగాళ్ల రక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు.
News Posted: 23 February, 2010
|