పరుగుల ప్యారడైజ్ గ్వాలియర్ : అదృష్టం బాగుంటే...వీర బాదుడు బాదే సెహ్వాగ్ బ్యాట్ నుండి వచ్చే సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. చేతులు దించకుండా చప్పట్లు కొట్టాల్సి రావచ్చు...కంటికి కాస్త కూడా రెస్ట్ లేకుండా అన్ని దిక్కుల్లో ఎగిరే బంతిని తదేకంగా చూడాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అవును దక్షిణాఫ్రికాతో జరిగే రెండో వన్డ్ మ్యాచ్ లో ఇవే పరిస్థితులు అందిరికీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కు వేదిక అయిన గ్వాలియర్ స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడమే ఇందుకు ప్రధాన కారణం.
జైపూర్ లో వన్డేలో ఉత్కంఠభరితంగా ఒక రన్ తేడాతో భారత జట్టు దక్షిణాఫ్రికాపై గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక తదుపరి ఫలితం కోసం గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో ఈ జట్లు తలపడనున్నాయి. ఈ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. ఈ స్టేడియాన్ని 'బ్యాటింగ్ ప్యారడైజ్' గా పిచ్ క్యూరేటర్ అభివర్ణించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.పిచ్ స్ట్రిప్ ను రెండేళ్ల క్రితం రూపొందించామని, ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం వినియోగిస్తున్నామని గ్వాలియర్ స్టేడియం క్యూరేటర్ అజయ్ సహస్రబుద్ధి చెప్పారు.
ఈ పిచ్ పై గతంలో అండర్ -22 మ్యాచ్ లు, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోపీలు నిర్వహించామని, ఈ మ్యాచ్ లలో పరుగుల వరద ప్రవాహం సాగిందని చెప్పారు. ఒక్కో జట్టు 300కి పైబడి పరుగులు చేయడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ కు టాస్ కీలకం ఏమాత్రం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ క్యూరేటర్ సమందర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, గ్రౌండ్ లో గడ్డి మెత్తగా ఉండేందుకు తాము ఎపిఎస్ఎ 80 అనే స్ప్రేని వినియోగిస్తున్నామని చెప్పారు. జైపూర్ మ్యాచ్ లో ఈ స్ప్రే సత్ఫలితాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా వాడాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ పిచ్ పై పరుగుల వరద ప్రవాహాంలా సాగుడం ఖాయమని, వీరేందర్ సెహ్వాగ్ వంటి బ్యాట్స్ మ్యాన్ తన సత్తా చాటేందుకు వీలుగు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
News Posted: 23 February, 2010
|