ఐపిఎల్ పై సుప్రీంలో పిల్ న్యూఢిల్లీ : ఫ్లడ్ లైట్ల వెలుగులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ పోటీల నిర్వహణను అనుమతించవద్దని బెంగాల్ పర్యావరణ కార్యకర్త ఒకరు మంగళవారం సుప్రీం కోర్టుకు ఒక పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. రాత్రి పోటీల వల్ల విద్యుచ్ఛక్తిని 'విపరీత స్థాయిలో వృథా చేయడమే' అవుతుందని, అంతేకాకుండా ఉగ్రవాదుల దాడుల ముప్పు కూడా పెరగవచ్చునని ఆ కార్యకర్త తన పిటిషన్ లో వాదించారు. కోలకతా వీధులలో దట్టమైన పొగను ఎగజిమ్మే వాహనాలు నడవకుండా నిషేధించాలంటూ ఉద్యమం సాగిస్తున్న సుభాస్ దత్తా పగటిపూట మ్యాచ్ ల నిర్వహణ వల్ల ఉష్ణ తాపం పెరగకుండా నిరోధించవచ్చునని, శబ్ద కాలుష్యాన్ని తగ్గించవచ్చునని సూచిస్తున్నారు.
దత్తా, ఆయన సారథ్యంలోని హౌరా గణతాంత్రిక్ నాగరిక్ సమితి తరఫున ఈ విషయమై సుప్రీం కోర్టులో ప్రత్యేక ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దేశంలో అన్ని ప్రాంతాలలో విద్యుత్ కోతలు పరిపాటి అయినట్లు పిల్ పేర్కొన్నది. 'అందువల్ల ఈ మ్యాచ్ లను పూర్తిగా పగటి వేళల్లో నిర్వహించడం శ్రేయస్కరం, విజ్ఞతతో కూడిన చర్య అవుతుంది. దీని వల్ల విద్యుత్ దుబారాను అరికట్టవచ్చు' అని పిల్ సూచించింది.
'అంతే కాకుండా, తీవ్రవాదులు దాడులు చేసే అవకాశం రాత్రి వేళల్లోనే హెచ్చుగా ఉంటుంది. సూర్యాస్తమయం అనంతరం భద్రతా ఏర్పాట్లు చేయడం మరింత కష్టం అవుతుంది' అని పిల్ పేర్కొన్నది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) 'ప్రైవేట్' సంస్థ కనుక ఇటువంటి మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి విద్యుత్, స్టేడియం, భద్రతా ఏర్పాట్ల 'ఖర్చు'లన్నిటినీ బోర్డు నుంచి రాబట్టాలని కూడా పిల్ కోరింది.
News Posted: 23 February, 2010
|