సచిన్ సరికొత్త రికార్డు గ్వాలియర్ : ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచిన ఏకైక బ్యాట్స్ మన్ గా భారత క్రికెట్ దిగ్గజం, చిచ్చరపిడుగు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండుల్కర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో దక్షిణాప్రికాతో బుధవారం జరుగుతున్న రెండో వన్డేలో ఈ అరుదైన రికార్డును సచిన్ తన పేరు మీద లిఖించుకున్నాడు. మొత్తం 147 బంతుల్లో సచిన్ మూడు సిక్సర్లు, 25 బౌండరీల సాయంతో ఈ రికార్డు స్కోర్ చేశాడు. వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీ చేయడంతో అంతకు ముందు 194 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన జింబాబ్వే ఆటగాడు చార్లెస్ కోవెంట్రీ రికార్డు, 194 పరుగులు చేసి ఔటైన పాక్ ఆటగాడు సయీద్ అన్వర్ రికార్డు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. అంతకు ముందు సచిన్ వన్డేల్లో తన రికార్డు 186 పరుగులను కూడా తానే అధిగమించాడు. వన్డేల్లో 29 సెంచరీలు చేసిన రికీ పాంటింగ్ సచిన తరువాతి స్థానంలో ఉన్నాడు. సచిన్ కు ఇది 46వ సెంచరీ కాగా, సమీప భవిష్యత్తులో సెంచరీల్లో సచిన్ దరిదాపులకు కూడా మరే క్రీడాకారుడూ వచ్చే అవకాశాలు కనిపించడంలేదు.
News Posted: 24 February, 2010
|