సౌతాఫ్రికా లక్ష్యం 402 గ్వాలియర్ : భారతదేశ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు టీమిండియా భారీ విజయ లక్ష్యాన్నే నిర్దేశించింది. ఇక్కడి కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో బుధవారం జరుగుతున్న కీలక రెండో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఈ మొత్తం స్కోరులో భారత క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండుల్కర్ ఒక్కడే చెలరేగి ఆడి సగం (200) పరుగులు చేయడం విశేషం. ఈ వన్డేలో కూడా భారత్ విజయం సాధిస్తే సీరీస్ దక్కుతుంది. దీనితో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం పదిలం అవుతుంది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ సచిన్ టెండుల్కర్ తో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, సెహ్వాగ్ తన వ్యక్తిగత స్కోర్ 9 పరుగుల వద్ద వేయిన్ పార్నెల్ బౌలింగ్ లో డేల్ స్టేయిన్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్ డౌన్ లో క్రీజ్ వద్దకు వచ్చిన దినేష్ కార్తీక్ తో కలిసి సచిన్ స్కోర్ బోర్డును పరుగులే పెట్టించారు. దినేష్ కార్తీక్ తన వ్యక్తిగత స్కోర్ 79 పరుగుల వద్ద పార్నెల్ బంతినే గిబ్స్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. టూ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన యూసఫ్ పఠాన్ కూడా చెలరేగి ఆడాడు. 35 బంతుల్లో 36 పరుగులు చేసి వాన్ డెర్ మెర్వ్ బౌలింగ్ లో డి విల్లియర్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక పక్కన, సచిన్ టెండుల్కర్ మరో పక్కన సౌతాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేశారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి బంతినీ ధోనీ గ్రౌండ్ నలుమూలలకూ పరుగులు పెట్టించాడు. కేవలం 35 బంతులు ఎదుర్కొన్న దోనీ 4 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో అతి వేగంగా 68 పరుగులు వ్యక్తిగత స్కోర్ చేశాడు.
కాగా, 147 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, 25 బౌండరీలతో 200 పరుగులతో నాటౌట్ గా నిలిచి, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్ మన్ గా చరిత్ర లిఖించిన సచిన్ టెండుల్కర్ సెహ్వాగ్ తో 25 పరుగుల భాగస్వామ్యం చేశాడు. దినేష్ కార్తీక్ తో 194 పరుగులు, యూసఫ్ పఠాన్ తో 81 పరుగుల, ధోనీతో 101 పరుగుల భాగస్వామ్యాలు చేశాడు. మొత్తం మీద దక్షిణాఫ్రికాపై గెలిచే తీరాలనుకున్న రెండో వన్డేలో టీమిండియా 401 పరుగులు చేసి ప్రత్యర్థికి 402 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
News Posted: 24 February, 2010
|