భారత్ స్థానం పదిలం గ్వాలియర్ : ఐసిసి వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ లో భారత్ తన ద్వితీయ స్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికాతో ఇక్కడి కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో బుధవారం జరిగిన డే & నైట్ వన్డేలో భారత్ 153 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి తన స్థానాన్ని పదిల పరచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 401 పరుగుల భారీ స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా జట్టుకు 402 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ కోటి చెరువుల నీళ్ళు తాగారు. చివరికి 42.5 ఓవర్లలో ఆలౌట్ అయ్యారు. దీనితో సౌతాఫ్రికా ఈ సీరీస్ ను, వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానాన్ని భారత్ కు అప్పగించింది. భారత్ చేసిన భారీ స్కోరులో సగం పరుగులు తానొకే ఒక్కడుగా చేసిన మేరు మగధీరుడైన సచిన్ టెండుల్కర్ దే ఈ విజయం అని ప్రపంచ క్రికెట్ అభిమానులు వేనోళ్ళా కొనియాడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ భారత్ అనూహ్యంగా రాణించి ఈ విజయాన్ని చేజిక్కించుకుంది. నేటి పోటీలో హీరో, ప్రపంచ క్రికెట్ చరిత్రను తిరగరాసిన సచిన్ టెండుల్కర్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చి నిర్వాహకులు గౌరవించుకున్నారు.
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సాధించాలన్నతొందరపాటులో దక్షిణాఫ్రికా అతి తక్కువ వ్యక్తిగత స్కోర్లకే వికెట్లను జారవిడుచుకుంది. కేవలం ఎబి డి విల్లియర్స్ ఒక్కడే భారత్ పద్మవ్యూహాన్ని తట్టుకొని ఎదురు నిలిచి ఒంటరి పోరాటం చేశాడు. 101 బంతుల్లో రెండు సిక్సర్లు, 13 బౌండరీల సాయంతో 114 పరుగులు తానొక్కడే చేసినప్పటికీ విల్లియర్స్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. మిగిలిన ఏ ఒక్క దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ కనీసం అర్ధ సెంచరీ దరిదాపులకు కూడా రాలేకపోయారు. గుడ్డిలో మెల్ల అన్నట్టు ఓపెనింగ్స్ బ్యాట్స్ హషిం ఆమ్ల ఒక్కడే కాస్త గౌరవనీయంగా 34 పరుగుల చేయగలిగాడు. దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హెర్చెల్లి గిబ్స్ 7, రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్ 12, కెప్టెన్ జాక్విస్ కల్లిస్ 11, అల్విరో పీటర్సన్ 9, జెపి డుమిని 0, మార్క్ బౌచర్ 14, వేయిన్ పార్నెల్ 18, డేల్ స్టేయిన్ 0, కార్ల్ లాంగ్వెల్ట్ 12 పరుగులు చేశారు.
భారత బౌలింగ్ లో ఎస్. శ్రీశాంత్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆశిష్ నెహ్రా, రవీంద్ర జడేజా, యూసఫ్ పఠాన్ తలో రెండేసి వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్ ఒక వికెట్ తీశాడు.
News Posted: 24 February, 2010
|