టీమిండియాలో యువ రక్తం చెన్నై : అహ్మదాబాద్ లో ఈ నెల 27 శనివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో వన్డే జట్టులో యువ క్రీడాకారులకు అవకాశం లభించింది. తమిళనాడు ఓపెనర్ మురళీ విజయ్, కర్ణాటక స్పీడ్స స్టర్ అభిమన్యు మిథున్ లకు మూడో వన్డేలో అవకాశం కల్పించాలని టీమిండియా సెక్టర్లు నిర్ణయించారు. భారతదేశంలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సీరీస్ ను టీమిండియా ఇప్పటికే 2 - 0 తేడాతో గెలుచుకున్నది. ఒక వైపున అంతర్జాతీయ వన్డేల్లో అజేయ డబుల్ సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ చరిత్రనే తిరగరాసిన సచిన్ టెండుల్కర్ కు మూడో వన్డేలో విశ్రాంతి ఇచ్చారు. భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు కూడా విశ్రాంతి కల్పించాలని నిర్ణయించారు. అహ్మదాబాద్ లో లాంఛనంగా జరిగే మూడో వన్డేలో ఆడే 14 మంది సభ్యులతో కూడి జట్టును ప్రకటించారు. గురువారం సమావేశమైన భారతజట్టు సెలక్షన్ కమిటీ అనంతరం జట్టు సభ్యులను ప్రకటించింది.
జట్టులో ఉత్తరప్రదేశ్ పేసర్ ప్రవీణ్ కుమార్ కు, ముంబాయి ఆల్ రౌండర్ అభిషేక్ నాయర్ లకు సెలెక్టర్లు ఫైనల్ జట్టులో స్థానం కల్పించలేదు. వారి బదులుగా అభిమన్యు మిథున్, రోహిత్ శర్మ మూడో వన్డేలో ఆడే అవకాశం కల్పించారు. కాగా, తన సోదరి వివాహం కోసం తొలి రెండు వన్డేలకూ దూరంగా ఉన్న హర్భజన్ సింగ్ కు కూడా సెలెక్టర్లు విశ్రాంతి కల్పించాలని నిర్ణయించారు. దీనితో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కడే భారత స్పిన్ విభాగంలో ఉంటాడు.
నాగపూర్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కు ప్రకటించిన జట్టులో అభిమన్యు మిథున్ పేరు ఉన్నప్పటికీ కోల్ కతాలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆడే జట్టులో తొలగించారు. గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున అహ్మదాబాద్ వన్డేలో ఓపెనర్ గౌతం గంభీర్, మిడిలార్డర్లో హార్డ్ హిట్టర్ యువరాజ్ సింగ్, పేసర్ జహీర్ ఖాన్ సేవలను భారత్ వినియోగించుకోలేకపోతోంది.
జట్టు : మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్/ కీపర్), మురళీ విజయ్, దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, యూసఫ్ పఠాన్, రవీంద్ర జడేజా, సుదీప్ త్యాగి, ఎస్. శ్రీశాంత్, ఆర్. అశ్విన్, అమిత్ మిశ్రా, అభిమన్యు మిథున్, ఆశిష్ నెహ్రా.
News Posted: 25 February, 2010
|