సచిన్ పై 'సేన' ప్రేమ ముంబయి : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కు భారతరత్న ఇవ్వాలని మహరాష్ట్ర కాంగ్రెస్ సీఎం అశోక్ చవాన్ చేసిన ప్రతిపాదనకు కాషాయ దళం మద్దతు పలికింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మహరాష్ట్ర చేసిన ప్రతిపాదన నినాదానికి శివసేన కూడా గొంతు కలిపింది. క్రికెట్ లో ఎన్నోరికార్డులను తిరగరాస్తూ, సంచలన రికార్డులు నమోదు చేస్తున్నసచిన్ భారతరత్న పురస్కారానికి అర్హుడని శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. ముంబయిలో శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఉద్ధవ్ మీడియాతో మాట్లాడుతూ, సచిన్ కు భారతరత్న పురస్కారం ప్రకటించాలన్న ప్రతిపాదనకు తమ మద్దతును కూడా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. శివసేనకు, సచిన్ కు మధ్య ముంబయి నగరంపై ఇటీవల వివాదం రగిలిన సంగతి తెలిసిందే.
ముంబయి నగరంపై వివాదం రగులుతున్న సమయంలో సచిన్ 'ముంబయి అందరిదీ' అంటూ చేసిన వ్యాఖ్యలు శివసేన అధ్యక్షుడు బాల్ థాక్రేకి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. 'సచిన్ క్రికెట్ ఆడుకోవాలి. కానీ రాజకీయాలు మాట్లాడితే ఆట మధ్యలో రన్ అవుట్ అయిపోతాడు' అంటూ థాక్రే శివసేన పత్రిక ఎడిటోరియల్ లో నిప్పులు కక్కారు. ఇందుకు ప్రతిగా సచిన్ స్పందిస్తూ నేను ముందు ఇండియన్ ని తరువాత మరాఠీని అని ప్రకటించారు. ఇలా సచిన్- శివసేన ల మధ్య రగిలిన ఈ వివాదం కొద్ది రోజుల క్రితమే సద్దుమణగింది. అయితే సచిన్ కు భారతరత్న ఇవ్వాలన్న మహరాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై శివసేన కూడా సానుకూలంగా స్పందించి మద్దతు పలకడం విశేషం.
News Posted: 27 February, 2010
|