చివరి వన్డే సౌతాఫ్రికాదే అహ్మదాబాద్ : ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో భారత జట్టుతో జరిగిన చివరి మూడో వన్డేను దక్షిణాఫ్రికా 90 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 365 పరుగులు చేసి టీమిండియాకు 366 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, జట్టులో అటు బౌలింగ్ లో కాని, ఇటు బ్యాటింగ్ లో కాని అనుభవజ్ఞులైన సీనియర్లు ఎవరూ లేకపోవడంతో ఈ లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేశారు. ఇంకా 5.3 ఓవర్లు మిగిలి ఉండగానే భారత జట్టు 275 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 59 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, 11 బౌండరీల సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ ఎబి డి విలియర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా చివరి వన్డే విజయంతో ఈ సీరీస్ లో భారత్ ఆధిక్యాన్ని 2 - 1 కి తగ్గించింది.
భారీ లక్ష్యం 366 పరుగుల చేయాల్సిన భారత జట్టు దినేష్ కార్తీక్, మురళీ విజయ్ లతో తన ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట 2.6వ ఓవర్ వద్ద ఓపెనర్ దినేష్ కార్తీక్ (11 వ్యక్తిగత పరుగులు) వికెట్ ను భారత్ కోల్పోయింది. అప్పటికి టీమిండియా స్కోర్ కేవలం 22 పరుగులు. అనంతరం 5.2వ ఓవర్ లో 40 పరుగుల స్కోర్ వద్ద మరో ఓపెనర్ మురళీ విజయ్ వికెట్ (25 పరుగుల)ను దక్షిణాఫ్రికా తీసుకుంది. వన్ డౌన్ లో బరిలో దిగిన విరాట్ కోహ్లీ ఒక్కడే టీమిండియాలో కనీసం అర్ధ సెంచరీ చేసి పరువు దక్కించుకున్నాడు. అతని తరువాత రోహిత్ శర్మ 48, సురేష్ రైనా 49, రవీంద్ర జడేజా 36 పరుగులు చేసి పరవాలేదనిపించారు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా దారుణంగావిఫలమై కేవలం 7 బంతులు ఎదుర్కొని 9 పరుగులకే వికెట్ ను సౌతాఫ్రికాకు అప్పగించి పెవిలియన్ చేరుకున్నాడు. మిడిలార్డర్లో దీటుగా నిలబడతాడనుకున్న యూసఫ్ పఠాన్ కూడా కేవలం 5 పరుగులతో వెనుదిరిగాడు. శ్రీశాంత్ 1, అభిమన్యు మిధున్ 24 పరుగులు చేశారు. సుదీప్ త్యాగి ఒక్క పరుగుతో నాటౌట్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా 4 వైడ్లు, 5 లెగ్ బైలు ఇచ్చింది. మొత్తం 275 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికా బౌలింగ్ లో డేల్ స్టేయిన్, లాన్వాబో సొసోబ్ చెరో మూడేసి వికెట్లు పడగొట్టారు. రోల్ఫ్ వాన్ డెర్ మెర్వె, జాన్ బోథా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
News Posted: 27 February, 2010
|