భారత్ చేతిలో పాక్ చిత్తు న్యూఢిల్లీ : మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ హాకీ జట్టును భారత్ చిత్తు చేసింది. దీనితో 28 సంవత్సరాల తరువాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ హాకీ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ 4 - 1 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి శుభారంభం చేసింది. ఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన గ్రూప్ 'బి' లీగ్ మ్యాచ్ లో భారత్ ఈ విజయాన్ని సాధించింది. భారత తరఫున డ్రాగ్ పిక్లర్ సందీప్ సింగ్ విజృంభించి రెండు పెనాల్టీ కార్నర్ లను గోల్స్ గా మలిచాడు. దాయాది పాక్ పై భారత్ ఘన విజయం సాధించడం ద్వారా గత డిసెంబర్ లో జరిగిన చాంపిన్స్ చాలెంజ్ లో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ పై 1975లో 2 - 1 గోల్స్ తేడాతో విజయం సాధించిన భారత్ మళ్ళీ ఇప్పుడే మరో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో ఆద్యంతమూ భారత్ ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే వచ్చింది. సొంత అభిమానుల మధ్య కోట్లాది భారతీయుల ఆకాంక్షలను నెవేర్చేందుకు భారత హాకీ జట్టు సభ్యులు సమైక్యంగా పోరాడారు. మైదానం గ్లాలరీల్లో కిక్కిరిసిన ప్రేక్షకుల జేజేల మధ్య దాయాదుల సమరంలో భారత జట్టు మెరుగైన ఆట ప్రదర్శించి అభిమానులకు చక్కని కానుక అందించింది. ఆట ప్రథమార్ధంలో ఒక్క గోలు కూడా చేయలేకపోయిన పాక్ ద్వితీయార్ధంలో ఒక్క గోలు మాత్రమే చెయగలిగింది. ప్రపంచ హాకీ కప్ గెలవలేకపోయినా పరవాలేదు గాని, భారత్ పైన మాత్రం గెలిచి తీరాలంటూ పాక్ జట్టు కెప్టెన్ జీషన్ ఖాన్ చేసిన ప్రకటన భారత హాకీజట్టు సభ్యుల్లో ఐక్యతను తీసుకువచ్చిందనే చెప్పాలి. అంతకు ముందు భారత హాకీ జట్టులో సభ్యుల మధ్య అనేక వివాదాలు నడిచేవి. అయితే, వారంతా ఇప్పుడు వాటిని పక్కన పెట్టి దాయాది జట్టును కంగు తినిపించాలన్న ఒకే ఒక్క ధ్యేయంతో ఆడారు. ఆట తొలి నిమిషం నుంచే భారత ఆటగాళ్ళు విశ్వరూపం ప్రదర్శించారు.
సందీప్ సింగ్ ఆట 35, 57 వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా, శివేంద్రసింగ్ 27వ నిమిషంలోను, 37వ నిమిషంలో ప్రభజోత్ సింగ్ చెరో గోల్ చేశారు. కాగా, పాకిస్తాన్ పెనాల్టీ కార్నక్ నిపుణుడు సొహైల్ అబ్బాస్ ఆట 57వ నిమిషంలో తమ జట్టు తరఫున ఒకే ఒక్క గోల్ చేశాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై చిరస్మరణీయమైన విజయం సాధించిన భారత హాకీ జట్టు క్రీడాకారులు ఒక్కొక్కరికీ హాకీ ఇండియా ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున నజరానా ప్రకటించింది. సందీప్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
News Posted: 28 February, 2010
|