ఐపిఎల్ లో షారూక్ ఆటపాట ముంబయి : బాలీవుడ్ కి షారుఖ్ ఖాన్ సూపర్ హీరో. కానీ ఐపీఎల్ లో మాత్రం ఈ హీరో కాస్త జీరో అయ్యాడు. సినిమాల్లో వరుస విజయాలు సాధించి బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్న షారుఖ్ ఐపీఎల్ మాత్రం ట్రోఫీ చేజిక్కించుకోలేక చితికిలపడుతున్నాడు. బాలీవుడ్ లో తన ఆట పాటలతో బాద్ షా స్థాయికి ఎదిగిన షారుఖ్ ఐపీఎల్ క్రికెట్ లో కూడా అగ్రస్థాయికి ఎదగాలని తాపత్రయపడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు ఐపీఎల్ ఎడిషన్స్ లోనూ లీగ్ స్థాయిలోనే తన జట్టు నిష్ర్కమించి బాద్ షాకి తీరని వేదనని మిగిల్చింది. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ త్రీ ప్రారంభమవుతుండటంతో ఈ సారైనా ట్రోఫీ సాధించాలని షారుఖ్ కసిగా ఉన్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఫ్రాంఛైజీ యజమానిగా ఉన్న షారుఖ్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని కైవశం చేసుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నాడు. నైట్ రైడర్స్ మ్యాచ్ లు జరిగే గ్రౌండ్ లోనే ఆడి పాడి తన జట్టు సభ్యుల్లో ఉత్తేజం నింపాలని భావిస్తున్నాడు.
ఐపీఎల్ మూడో విడత ఈ నెల 12 తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో ఎలాగైనా తన జట్టు ట్రోఫీ సాధించేలా చేయాలని షారుఖ్ గట్టి పట్టదులతో ఉన్నాడు. గత టోర్నీలో తన జట్టు ఘోరంగా పరాజయం పాలుకావడంతో దక్షిణాఫ్రికా నుండి అర్థంతరంగా ఇండియాకి వచ్చేసాడు. అయితే సారి ఐపీఎల్ లో గతంలో వలె ఓటమి పాలు కాకుండా విజయం దిశగా సాగేలా చూడాలని షారుఖ్ కృత నిశ్చయంతో ఉన్నాడు. గతంలో జట్టు సభ్యులకు ఉత్సాహం కలిగించడానికి స్వయంగా దక్షిణాఫ్రికా వెళ్లాడు షారుఖ్. కానీ ఫలితం లేకపోయింది. అందుకే ఈ సారి ప్లాన్ మార్చేసాడు. నైట్ రైడర్స్ జట్టు మ్యాచ్ లు ఆడే సమయంలో తాను ఆడి పాడాలని షారుఖ్ నిర్ణయించాడు. 'ఈ సారి నా జట్టు కుర్రాళ్లతో నేను ఉత్తేజపరచనున్నాను. ఈ మేరకు వారితో కలసి నృత్యం చేస్తాను, వారి కోసం పాడుతాను కూడా' అని షారుఖ్ మీడియాకు చెప్పాడు. నైట్ రైడర్స్ ఆడే ఏడు మ్యాచ్ లలోనూ తాను ఆడి పాడనున్నట్లు బాద్ షా వెల్లడించాడు. అలాగే క్రికెట్ ను ప్రొత్సహించేందుకు నోకియా, పారా లతో కలసి కొత్త తరం క్రికెటర్లకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెప్పాడు.
బాలీవుడ్ కు ఐపీఎల్ పెద్దగా అచ్చి వచ్చినట్లు లేదు. బాలీవుడ్ నుండి హీరోయిన్లు ప్రతీజింటా, షారుఖ్ లు ఫ్రాంచైజీలు తీసుకున్నారు. వీరిద్దరు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లు విజయాలు సాధించడానకి నానా పాట్లు పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ జట్టును కోన్న ప్రీతీ జింటా ఐపీఎల్ లో లాభం గూబల్లోకి రావడంతో ఇటీవలే అమ్మేసింది. ఇక షారుఖ్ జట్టు సాధించిన విజయాలు కంటే, ఓడినవే ఎక్కువ. కానీ షారుఖ్ తన జట్టు ట్రోఫీ సాధించే వరకు పోరాడుతున్నాడు.
News Posted: 1 March, 2010
|