భారతరత్న ఇష్టమే: సచిన్
ముంబయి: దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారత రత్న' పొందిన వారి సరసన ఉండటం తనకూ ఇష్టమేనని, అయితే ఇప్పుడప్పుడే దాని గురించి తాను ఆలోచించడం లేదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని దైవానికే వదులుతున్నానని ఆయన అన్నారు. మంగళవారం నాడు సచిన్ మీడియాతో మాట్లాడుతూ 'అది చాలా అరుదైన గౌరవం. దానిని దక్కించుకున్నవారు నాకే కాదు మొత్తం దేశ ప్రజలందరికీ హీరోలే. అలాంటి వారి సరసన స్థానం దొరకాలని ఎవరు కోరుకోరు?.కాని ఇప్పుడు నా దృష్టంతా క్రికెట్ ఆట మీదే ఉంది. ఒకవేళ భారతరత్న రావాలనుంటే అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంద 'ని అన్నాడు. గ్వాలియర్ వన్డేలో దక్షిణాఫ్రికా పై సచిన్ రికార్డు స్కోరు రెండువందల పరుగులు సాధించిన అనంతరం మాజీ క్రికెటర్లు అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్ సర్కార్ లు సచిన్ భారతరత్నకు అర్హుడని పేర్కొన్నారు. అలానే బ్రాడ్ మన్ కంటే సచినే మేటి క్రికెటర్ అని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు.
కానీ ఇలా పోల్చిచెప్పడాన్ని సచిన్ తిరస్కరించాడు. 'ఇలాంటి పోలికలపై నాకు నమ్మకం లేదు. సర్ బ్రాడ్ మన్ అనే కాదు ఇప్పుడు క్రికెట్ ఆటకపోయినా సరే నేను అందరినీ గౌరవిస్తాను. దేశం కోసం ఆడటం నాకు ఆనందం కలిగిస్తుంది. జట్టు గెలపునకు నా ఆట తొడ్పడితే మరింత ఆనందిస్తాను ' అని సచిన్ చెప్పాడు.
పాకిస్తాన్ పై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించిన భారత హాకీ జట్టును సచిన్ ప్రశంసలతో ముంచెత్తాడు. వారికి అభినందనలు తెలిపాడు. 'మొన్న నేను ఆ మ్యాచ్ ను చూశాను. ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. మనవాళ్లు అద్భుతంగా ఆడారు. ముగింపు సమయంలో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. మనవాళ్లు గెలవడం సంతోషాన్నిచ్చింది' అని సచిన్ పేర్కొన్నాడు. టోర్నమెంటు పూర్తయ్యేవరకూ హాకీ జట్టుకు తన మద్దతు ఉంటుందని, భారతీయలందరి తరపున వారికి తాను ఈ వాగ్దానం చేస్తున్నానని సచిన్ స్పష్టం చేశాడు. ఆటతీరులో ఆటుపోటులు ఉన్నా వారు స్థిరంగా రాణించాలని సచిన్ కోరాడు. జట్టు కష్టదశలను ఎదుర్కొంటున్నప్పుడే ప్రజల అండదండలు క్రీడాకారులకు ఉండాలని సచిన్ కోరాడు. అందుకే తామంతా భారత హాకీ జట్టుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పాడు. జాతీయ క్రీడ అయినప్పటికీ తనకు హాకీతో అంతగా పరిచయం లేదని, తాను ఆ క్రీడలో నిపుణుడిని కానని, అయినా ప్రజల అంచనాల మేరకు హాకీ జట్టు రాణించాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటానని సచిన్ అన్నాడు.
రికార్డు స్కోరు రెండువందల పరుగుల గురించి మాట్లాడుతూ తాను బ్యాటింగ్ కు దిగినప్పుడు ఆ స్కోరు సాధిస్తానని తనకు తెలియదని అన్నాడు. కానీ రికార్డు నమోదు అయిందని, అది భారతీయ రికార్డు కావడం తనకు గర్వకారణమని సచిన్ పేర్కొన్నాడు. అందరిలానే తాను కూడా 2011 వరల్డ్ కప్ టోర్నీ కోసం ఎదురు చూస్తున్నాని సచిన్ అన్నాడు.
News Posted: 2 March, 2010
|