రిటైర్ అవుతా: ముత్తయ్య మెల్ బోర్న్ : స్పిన్ మాంత్రికుడు శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే అక్టోబర్ లో వెస్టిండీస్ పర్యటన అనంతరం టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెబుతానని మురళీధరన్ ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్ లో 800 మంది బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ పంపిన ఘనతను సాధించడానికి కేవలం ఎనిమిది వికెట్ల దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్ టూర్ లో ఈ మ్యాజికల్ రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు. 2011లో జరిగే వరల్డ్ కప్ టోర్నీ అనంతరం క్రికెట్ క్రీడ నుంచి వైదొలగుతానని ముత్తయ్య ఇప్పటికే ప్రకటించాడు.
'నేను ఇక రెండో మూడో టెస్టులు ఆడతాను. అంతే. తర్వాత రిటైర్ మెంటే. వెస్టిండీస్ తో జరిగే సీరిసే నా ఆఖరి టెస్ట్ మ్యాచ్ లు' అని మురళీ ధరన్ వివరించాడు. 'ఇక నా భవిష్యత్ అంతా 2011 వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ లు ఆడటమే. రేపటి వరల్డ్ కప్ ఆడటానికి నేను ఫిట్ అయితే అదే నా చివరి మజిలీ' అని చెప్పాడు. ఆల్ కాయిదా తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నా తాను భారత్ లో ఐపిఎల్ మ్యాచ్ లు ఆడతానని మురళీధరన్ స్పష్టం చేశాడు. శ్రీలంక క్రికెటర్లు ఇండియా వెళ్ళి ఐపిఎల్ లో ఆడాలని సలహా ఇచ్చాడు. శ్రీలంక ఆటగాళ్ళంతా వెళ్ళాలని చెప్పాడు. ఒకవేళ వెళ్ళకపోతే చాలా నష్టమని, ఉపఖండంలో ఇక క్రికెట్ కు భవిష్యత్ ఉండబోదని మురళీధరన్ అన్నాడు.
News Posted: 3 March, 2010
|