మున్నాభాయ్ ఐపీఎల్ ఆహ్మదాబాద్ : మున్నాభాయ్ ఎంబిబిఎస్.. నిన్నటి టైటిల్ . మున్నాభాయ్ ఐపీఎల్ లెటెస్ట్ టైటిల్. కాకపోతే మీరనుకుంటున్నట్లు మున్నాభాయ్ ఐపీఎల్ సంజయ్ దత్ తీస్తున్న కొత్త సినిమా కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సంజయ్ దత్ అజయ్ దేవగన్ తో కలిసి చేజిక్కించుకోడానికి ప్రయత్నిస్తున్న క్రికెట్ టీమ్ మాత్రమే. అవును మన మున్నాభాయ్ కూడా ఐపీఎల్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేస్తున్నాడు. షారుఖ్, ప్రీతీ, శిల్పల తర్వాత మున్నాభాయ్ కూడా ఐపీఎల్ పిచ్ పై అదృష్టం పరీక్షించుకోడానికి సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ మంజూరు కావడం దాదాపు ఖరారు కావడంతో దానిని దక్కించుకునేందుకు మున్నాభాయ్ తహతహలాడుతున్నాడు. యాక్షన్ కింగ్ అజయ్ దేవగన్ తో చేతులు కలిపి ఐపీఎల్ - 4 పిచ్ పైకి మున్నాభాయ్ దిగుతున్నాడు. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన ఈ హీరోలు ఐపీఎల్ లో కూడా రికార్డులు సృష్టించేందుకు రంగంలోకి దిగుతున్నారు.
ఐపీఎల్ ఫ్రాంఛైజీని చేజిక్కుంచుకోవడమంటే ఇప్పుడు మాటలు కాదు. ఒకప్పుడు సులభంగానే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు మంజూరైనా ఇప్పుడు దాని నిబంధనలను మరింత కఠినం చేసారు. జైపూర్ టీం అయితే కేవలం 67 మిలియన్ డాలర్లకే ఫ్రాంఛైజీ లభించింది. కానీ తాజా నిబంధనల ప్రకారం 225 డాలర్ల మిలియన్ల పెడితేనే కాని ఫ్రాంఛైజీ దక్కే అవకాశాలు లేవు. బిడ్ దాఖలు చేసే వ్యక్తి కనీసంగా ఒక బిలియన్ డాలర్ల ఆస్తికి యాజమానిగా ఉండాలి. భాగస్వాముల పెట్టుబడిని కలుపుకొని 225 మిలియన్ డాలర్లను బిడ్డింగ్ చేయగల సోమ్ము సత్తా ఉండాలని కూడా నిబంధన ఉంది. ఐపీఎల్ తాజాగా మరో 7 కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా. వీటిలో అహ్మదాబాద్ కు ఓ ఫ్రాంఛైజీ మంజూరయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి గతంలోనే అహ్మదాబాద్ కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రావాల్సి ఉంది. అయితే ఆ అవకాశం తృటిలో తప్పింది. ఖర్చులు తక్కువగా ఉండటంతో జైపూర్ ఫ్రాంచైజీ అవకాశాన్ని దక్కించుకుంది. ఎమర్జింగ్ మీడియా సంస్థ కేవలం 67 మిలియన్ డాలర్లకే ఫ్రాంఛైజీ ఛాన్స్ కొట్టేసింది.
ఐపీఎల్ తాజాగా ప్రకటిస్తున్న ఫ్రాంచైజీల జాబితాలో అహ్మదాబాద్ ఉండటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇక్కడి మోతెరా స్టేఢియంలో మౌలిక వసతులు మెరుగ్గా ఉండం, సంజయ్ దత్ , అజయ్ దేవగన్ వంటి బిగ్ షాట్స్ భాగస్వామ్యంతో బిడ్ దాఖలు చేయడానికి రంగం సిద్ధం కావడం కలసి అహ్మదాబాద్ కు ఫ్రాంఛైజీని తెచ్చిపెట్టడం ఖాయమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. సంజయ్ దత్, అజయ్ దేవగన్, మరో కార్పొరేట్ కంపెనీ కలసి బిడ్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఐపీఎల్ - 4 ఫ్రాంఛైజీలు అహ్మదాబాద్ తో పాటుగా పుణె, ఇండోర్, నాగ్ పూర్, ధర్మశాల వంటి నగరాలకు కూడా లభించవచ్చుని ఐపీఎల్ అధికారి ఒకరు చెప్పారు. కొత్తగా ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేసే నగరాల వివరాలను ఆదివారం ఐపీఎల్ ప్రకటించనుంది.
News Posted: 6 March, 2010
|