పనిమనిషికీ పెయిడ్ లీవ్ బెంగళూరు : ఎలాంటి స్వేచ్ఛా, సౌకర్యాలు లేకుండా దశాబ్దాలుగా మగ్గిపోతున్న పనిమనుషుల జీవితాల్లో వెలుగురేఖలు వికసించే సమయం ఎంతో దూరంలో లేదు. ఇంటి పనులు చేసే మహిళలకు వారాంతపు సెలవు ఇవ్వనని తిరస్కరించడం ఇకపై కుదరకపోవచ్చు. నెలవారీ జీతాలు, సిక్ లీవ్ లేదా వ్యక్తిగత సెలవు ఇచ్చి తీరాల్సిన పరిస్థితి రాబోతోంది. ఏ మహిళా పనిమనిషినైనా పని నుంచి తీసివేయాలంటే ఆమెకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన నిబంధన అమలులోకి రానుంది. పనిమనుషులు సమైక్యమై జీతాల గురించి అడిగేందుకు, సంఘాన్ని ఏర్పాటు చేసుకునేందుకు, అధిక పనికి అధిక వేతనం డిమాండ్ చేసే స్వాతంత్ర్యం కూడా వారికి లభించే అవకాశం వస్తోంది. కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండిన వారిని మాత్రమే పనిలో పెట్టుకోవాలన్న నిబంధనా అమలులోకి రానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటి పనులు చేసే మహిళలకు ఇలాంటి సౌకర్యాలు బహుమతిగా లభించనున్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) రూపొందించిన నిబంధనలు అమలులోకి వస్తే ఇవ్వన్నీ తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది.
జెనీవాలో సోమవారంనాడు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నూరవ మహిళా దినోత్సవ సదస్సు నిర్వహిస్తోంది. భారత్ సహా మొత్తం 100 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో 'డీసెంట్ వర్క్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్' పేరున ఇలాంటి నిబంధనలను ఆమోదించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మహిళా సదస్సులో ప్రవేశపెట్టేందుకు ఈ నిబంధనలను ఐఎల్ఓ ఇప్పటికే సిద్ధం చేసింది.
ఇంటి పనులు చేసే మహిళలకు కనీస వేతనం అమలు చేయాలంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2004లో పెద్ద ఎత్తున నిబంధనల జాబితా తయారు చేసింది. అయితే, అవి ఇంకా కాగితాలకే పరిమితమై ఉన్నాయి. 'ఇంటి పనులు చేసే మహిళలకు కనీస వేతనం చెల్లించాలన్న శాసనబద్ధమైన నిబంధన ఏదీ ఇంతవరకూ భారతదేశంలో లేదు. సుమారు 9 కోట్ల మంది వరకూ ఇంటి పనిమనుషులు ఉన్న మన దేశంలో వారి విషయంలో ఇంకా ఫ్యూడల్ వ్యవస్థే అమలవుతోంది. వారి సౌకర్యాల విషయంలో ఎలాంటి నిబంధలూ ఇప్పటివరకూ అమలులో లేకపోవడం చాలా బాధాకరం' అని ఇంటి పనిమనుషుల హక్కుల సంఘానికి చెందిన గీతా మీనన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పనివారికి నిర్ణీత తేదీల్లో జీతాలు చెల్లించాలని కూడా అంతర్జాతీయ మహిళా కార్మిక సదస్సు తన సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
News Posted: 7 March, 2010
|