దిగివచ్చిన ఐపిఎల్ ముంబయి: కొత్త ఫ్రాంచైజీల విషయంలో అడ్డుగోలు నిబంధనలు పెట్టిన ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడీ ఎట్టకేలకు దిగివచ్చాడు. ఫ్రాంచైజీల ఖరారులో ఉన్న నిబంధనల పట్ల వెల్లువెత్తిన నిరసనతో మోడీ మెత్తపడ్డాడు. వాటిని మార్చిన అనంతరమే కొత్త ఫ్రాంచైజీలను ఖరారు చేయాలని నిర్ణయించడంతో ఆదివారం జరగాల్సిన కొత్త ఫ్రాంచైజీ బిడ్డింగ్ ప్రక్రియ ఆగిపోయింది. దాంతో వచ్చే ఏడాది జరిగే నాలుగో విడత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 టోర్నీలోకి కొత్తగా అడుగుపెట్టబోయే ఫ్రాంచైజ్‌లు ఎవరికి దక్కుతాయో తెలియడానికి మరి కొంత నిరీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకు ముందే పిలిచిన బిడ్డింగ్‌లను ఆదివారం తెరుస్తామని, కొత్త ఫ్రాంచైజ్‌ల పేర్లను ప్రకటిస్తామని టోర్నమెంట్ కమిషనర్ లలిత్ మోడీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
వాయిదా నిర్ణయంతో అందిన బిడ్‌లు తెరవకుండానే వెనక్కు ఇచ్చేస్తున్నట్టు లలిత్ మోడీ ఆదివారం చెప్పాడు. సవరించిన నిబంధలతో ఈనెల తొమ్మిది కొత్త బిడ్‌లకు ఫారాలను జారీ చేస్తామని, మార్చి 21వ తేదీ ఉదయం పది గంటల్లోగా చెన్నైలో జరిగే సమావేశంలో వాటిని సమర్పించాల్సి ఉంటుందని వివరించాడు. 11 గంటలకు బిడ్‌లను తెరుస్తామని, కొత్త ఫ్రాంచైజ్‌ల ఎంపికను పూర్తి చేస్తామని వివరించాడు. బిడ్‌లను వేసే సమయానికే 100 కోట్ల రూపాయలను బ్యాంక్‌లో డిపాజిట్ చేయడమేగాక, 430 కోట్ల రూపాయలకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని తొలుత నిర్ణయించామని, అయితే, చాలా మంది ఈ నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని మోడీ పేర్కొన్నాడు. ఈమేరకు తనకు చాలా లేఖలు అందాయని అన్నాడు. అందుకే, డిపాజిట్ మొత్తాన్ని 10 కోట్లకు తగ్గించామని తెలిపాడు. అదే విధంగా బిడ్‌ను సొంతం చేసుకున్న ఫ్రాంచైజ్‌లు ఆతర్వాత 48 గంల్లోగా 43 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ చూపితే సరిపోతుందని అన్నాడు. డిపాజిట్, బ్యాంక్ గ్యారంటీ మొత్తాలను తగ్గిస్తున్నప్పటికీ, ఒక్కో ఫ్రాంచైజ్‌కి నిర్ధారించిన 225 మిలియన్ డాలర్ల బేస్ ప్రైస్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని అన్నాడు.
News Posted: 7 March, 2010
|