టిడిపి టిక్కెట్లపై సస్పెన్స్
హైదరాబాద్: టిక్కెట్లు వస్తాయో రావో తెలియని అయోమయ స్థితిలో పడి తెలుగుదేశం నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. మహా కూటమిలో వామపక్షాలతోపాటు టీఆర్‌ఎస్ కూడా చేరడం పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపినప్పటికీ పార్టీ అభ్యర్థుల ఖరారులో జరుగుతున్న జాప్యం ఈ ఉత్సాహాన్ని ఆవిరి చేస్తోంది. పొత్తుల వల్ల కొన్ని స్థానాలు నష్ట పోయినప్ప టికీ మిగిలిన స్థానాల్లో ఎవరిని నిలబెడతారనేది చర్చనీయాంశమైంది. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ చివరి క్షణం వరకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేయకపోవచ్చని సీనియర్ నేతలు భావిస్తున్నారు. అయితే, చివరి క్షణం వరకు పార్టీని విడిచిపెట్టేది లేదని, తమ నాయకుడు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కొందరు నాయకులు పైకి చెబుతూనే.. లోపాయికారీగా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. చివరి క్షణం వరకు అభ్యర్థులను ఖరారు చేయకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో వారు ఉన్నారు.
టిక్కెట్ వచ్చే అవకాశమున్న పార్టీలో దూకడానికి సిద్ధమని కొందరు నాయకులు ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. ఇప్పటికే మోత్కుపల్లి నర్శింహులు, కొత్త పల్లి సుబ్బారాయుడు వంటి నాయకులు ఇలాంటి ఆలోచనతో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి తమ్మినేని సీతారం, కళా వెంకట్రావులు పీఆర్పీలోకి వెళ్లారు. దేవేందర్ గౌడ్ వేరే పార్టీ పెట్టారు. భూమా దంపతులు కూడా పీఆర్పీలోకి దుకారు. వీరంతా ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందో ఆలోచించుకోవాల్సిన అవసర ఉందని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉంటారని ఆయన అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కారణంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ లేదా ప్రజారాజ్యం పార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేవని, అయితే ఇది ఊహించిందేనని ఇది ఆయన అన్నారు.
మహా కూటమి వల్ల కొన్ని స్థానాలు తగ్గినా,మిగిలిన స్థానాల్లో మందుగానే అభ్యర్థులను ఖరారు చేసినట్టయితే విస్తృత ప్రచారానికి అవకాశం ఉంటుందని, చివరి క్షణంలో అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తే కలిగే ప్రయోజనం లేదని వారంటున్నారు. కేవలం పొత్తుల వల్లే గెలుస్తామని భావించడం పొరపాటని, అభ్యర్థుల ఎంపిక కూడా గెలుపుపై ప్రభావం చూపిస్తుందం టున్నారు.గెలిచే అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేస్తే.. కలిసి వస్తుందని లేదంటే మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ముందుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లయితే...ఇతర పార్టీల కంటే ముందే ప్రచారం చేసుకోవడంతోపాటు, మహాకూటమి లక్ష్యం నెరవెరే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలను పార్టీ అధిష్టానం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ద్వితీయ శ్రేణి నాయకుల అంటున్నారు. కాగా, ప్రస్తుతం సిట్టింగ్‌లు, సీనియర్ నాయకులు పోటీ చేసే స్థానాలపై ఎలాంటి సందేహం లేదు. వారికి ఖచ్చితంగా టిక్కెట్ లభిస్తుంది కాబట్టి తమ స్థానాలపై వారు ధీమాగా ఉన్నారు. ఈ మేరకు విధంగా చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
చివరి క్షణం వరకు అభ్యర్థులు పేర్లు ఖరారు చేయకపోయినప్పటికీ ఏ నియోజక వర్గం నుంచి ఎవరిని నిలబెట్టాల నుకుంటున్నది సూచనప్రాయంగా వెల్లడించినా సరిపోతుందని ఒక జిల్లా నాయకుడు అన్నారు. దీనివల్ల టిక్కెట్ ఆశిస్తున్న వారిలో కొంత ధీమా ఉంటుందని, లేదంటే పార్టీల ఫిరాయింపులు తప్పవని తెలుస్తోంది. కాగా, పార్టీ వర్గాల కథనం ప్రకారం కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాతే..టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయడం జరగుతుందని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండబోదని ఆ పార్టీ వర్గాలు తెగేసి చెప్పుతున్నాయి.
News Posted: 7 February, 2009
|