మాస్కోః రష్యా మొబైల్ ఫోన్స్ పై ఒక విచిత్రమైన 'వైరస్'దాడి చేసింది. ఆ మొబైల్ వినియోగదార్ల బ్యాంక్ అకౌంట్లను తన అజమాయిషీలోకి తెచ్చుకునే విధంగా ఒక అనధికార ఎస్ ఎమ్ ఎస్ ను తాను దాడి చేసిన ఫోన్ నుండే ఆ వైరస్ పంపుతుంది. అలా సంబంధిత మొబైల్ వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లను కబ్జా చేసి 'డబ్బును కాజేసే' వైరస్ ప్రపంచ వ్యాప్తంగా దాడి చేసే ప్రమాదముందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ 'వైరస్'ను ఇప్పటిదాకా రష్యాలో మాత్రమే కనుగొన్నారు. ఇప్పుడది ఇండోనేషియాకు కూడా వ్యాపించింది. ఈ మధ్యకాలంలో ఇండోనేషియా సెల్ ఫోన్ లో కూడా కనుగొనడం జరిగిందని ఒక ప్రముఖ యాంటీ వైరస్ లేబొరేటరీ తెలిపింది.
'మొబైల్ ఫోన్ వినియోగదారుల అకౌంట్లను అనధికారికంగా వినియోగించుకోవడం భవిష్యత్ లో ఒక ధోరణిగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించనుంది'అని మాస్కో కేంద్రంగా పనిచేసే 'కస్పెరస్కీ ల్యాబ్'వైరస్ విశ్లేషకుడు డెనిస్ మాస్లెన్నికోవ్ విశ్లేషించినట్లు రష్యా టుడే టివి తెలిపింది. సెల్ ఫోన్ లోకి ప్రవేశించిన వైరస్ మొదటగా సెల్ అకౌంట్ పై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధిస్తుంది. ఆ తర్వాత సదరు బాధితుని అకౌంట్ లోని డబ్బును మరో అకౌంట్ లోకి బదలాయించమని కోరుతూ ఒక సర్వీస్ నెంబర్ కు ఎస్ ఎమ్ ఎస్ పంపుతుంది. ఇప్పటికీ పేరుపెట్టని ఈ వైరస్ చాలా శక్తివంతమైనది. బాధితుని మొబైల్ అకౌంట్ పై అధిపత్యాన్ని సంపాదించి డబ్బును కాజేస్తుంది.
సింబియాన్ ఫైల్ సిస్టెమ్ గల మొబైల్ పరికరాల నుండి ఎస్ ఎమ్ ఎస్ మనీ ట్రాన్స్ ఫర్ సౌకర్యం ఉంటుంది. అలాంటి ఫౌన్లలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. వైర్ లెస్ ఫోన్లు, పిడిఏ నెట్ వర్క్ ఫోన్లు అసంఖ్యాకంగా ఉండడం, మరింత సంక్లిష్టంగా ఉండడంతో వాటిలోకి ఈ వైరస్ ప్రవేశాన్ని నిరోధించడం చాలా కష్టం.ఒక పెద్ద మొబైల్ ఉత్పాతం సంభవించనుంది. కొన్ని వైరస్ లు ఈపాటికే చాలా చురుకుగా దూసుకెళుతున్నాయి.