నిరుద్యోగం కోరల్లో భారత్
న్యూఢిల్లీః లేఆఫ్ సునామీ భారత తీరాన్ని కూడా తాకింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక సంస్థ సిటి గ్రూప్ భారతీయ శాఖల్లో ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య రాబయే మాసాల్లో మరింతగా పెరగనుంది.ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగే లేఆఫ్ ల ఛాయలు ఇప్పటివరకు భారత దేశంలో కనపడలేదు. అయితే ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు నిరుద్యోగులై స్వదేశానికి చేరడం, పలు విదేశీ సంస్థల భారతీయ శాఖల్లో లేఆఫ్ లు ఉండడంతో భారత దేశాన్ని సైతం లేఆఫ్ సునామీ ముంచెత్తనుందని సిటీ బ్యాంకు నివేదిక తెలిపింది.
'ఉపాధి కల్పనపై, ఆత్మవిశ్వాసంపై, ధరల స్థితిగతులపై గతంలో కంటే మరింత వత్తిడి పెరుగుతుంది.అంతకంటే,వలస కార్మికులు భారత దేశానికి తిరిగి రావడం,దాంతో భారత దేశానికి చేరే విదేశీ మారక ద్రవ్య పరిమాణం గణనీయంగా పడిపోవడం జరుగుతుంది'అని సిటి ఇండియా ఆర్థివేత్త రోహిణి మల్కాని తన నివేదికలో తెలిపారు. ఆభరణాలు,వజ్రవైఢూర్యాల వాణిజ్య రంగం, ఆటో, టెక్స్ టైల్స్ లాంటి ఎగుమతి ఆధారిత రంగాల్లో 2008 ఆక్టోబర్ - డిసెంబర్ మధ్యకాలంలో 5 లక్షల ఉద్యోగాలు ఆవిరైనట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించిందని సిటీ నివేదిక పేర్కొంది.
మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 10 శాతంగా ఉన్న సంఘటిత రంగంలో పనిచేస్తున్న 38.5 కోట్ల మందికి సంబంధించిన గణాంకాలను మాత్రమే ఈ నివేదిక వెల్లడించింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఉద్యోగ భద్రత కీలక ఎన్నికల నినాదంగా మారుతుందని ఆ నివేదిక తెలిపింది. భారత దేశ నిరుద్యోగ రేటు అధికారికంగా 8.2 శాతంగా ఉంది. అయితే అసలు విషయమేమంటే అజ్ఞాతంగా ఉండే నిరుద్యోగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది.రంగాలవారీగా పరిశీలిస్తే దేశ శ్రామిక జనంలో దాదాపు 50 శాతం పైగా వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. భారత స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా కేవలం 18 శాతం మాత్రమే. ఈ రంగం కుంటుపడితే ప్రజల ఆదాయాల మధ్య గండి తీవ్రతరమవుతుంది.ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు మరింతగా దిగజారిన, క్షీణించిన నేపథ్యంలో అమెరికాలో వరుసగా మూడు నెలల నుండి ఉద్యోగాలు క్షీణిస్తూనే ఉన్నాయి.జనవరిలో మరో 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.నిరుద్యోగ రేటు 7.6 శాతానికి చేరుకుంది.అదే సమయంలో,ప్రపంచ నిరుద్యోగుల సంఖ్య 1.8 నుండి 5 కోట్లకు పెరగనుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది.
News Posted: 9 February, 2009
|