వైఎస్ మడత పేచీ
(వరప్రసాద్ గాలిదేవర)
హైదరాబాద్ : ఆదేంటో చెప్పాలని పట్టుబట్టారు. చెప్పలేదని స్పీకర్ ను, ముఖ్యమంత్రిని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధమన్నారు. మోసం అన్నారు. ముఖ్యమంత్రి నోటితో ప్రకటించకముందే విషయం కనుక్కోడానికి విపక్షాల నేతలు విశ్వ ప్రయత్నం చేసారు. అసెంబ్లీ చివరి రోజు, ఎన్నికల దగ్గర రోజు ఎలాంటి బాంబులాంటి ప్రకటనతో ఒక్కసారిగా ఓటర్లందరినీ ముఖ్యమంత్రి తనవైపు తిప్పేసుకుంటాడోనని టెన్షన్ పడిపోయారు.విమర్శలు గుప్పించారు. చివరకు వాకౌటు కూడా చేశారు. మీడియా పుణ్యమా అని రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి చేయబోయే కీలక ప్రకటన ఏమై ఉంటాదోనని ఊపిరి బిగబట్టి మరీ టెలివిజన్లకు అతుక్కుపోయారు. తనపై, తన కుమారునిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రకటనా? ఒకవేళ కొంపదీసి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా ప్రకటనా? బుధవారం నాటి మార్షల్స్ దాడి వ్యవహారంపై ప్రకటనా? దేనిమీదనైనా న్యాయ విచారణ ప్రకటనా? ప్రత్యేక తెలంగాణా ఇచ్చేస్తామంటూ సంచలన ప్రకటనా? ఊహాగానాలతో గురువారం అసెంబ్లీ అవరణ అంతా సందడి సందడిగా మారిపోయింది.
ఆ సుమూహర్తం రానే వచ్చింది. ప్రకటన చేతికి ముందుగానే అందింది. చదువు కున్నారు. చప్పబడిపోయారు. తెలంగాణా ఏర్పాటు అంశంపై ఒక సంయుక్త కమిటీని నియమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి ప్రకటన పూర్తి పాఠం చదువుకున్న తెలంగాణా అభిలాషులకు చుక్కలు కనిపించి ఉంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రత్యేక తెలంగాణా ఇచ్చే ఉద్దేశం నూటికి నూరు శాతం లేదని మరోసారి స్పష్టంగా అర్ధమై ఉంటుంది. ఈ ప్రకటనతో ముఖ్యమంత్రి తెలంగాణా ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెట్టారని తెరాస ఎమ్మెల్య్ హరీష్ రావు ఆక్రోశించినా, ఒంట్లో చీమూ, నెత్తురూ ఉంటే కాంగ్రెస్ లోని తెలంగాణా నాయకులంతా బయటకు రావాలని, తెలంగాణా ఉద్యమంలో చేరాలని పిలుపు ఇచ్చినా అర్ధం చేసుకోతగినదే. కేవలం ఎన్నికలకు ముందు తెలంగాణాపై కాంగ్రెస్ వైఖరి తేటతెల్లం చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు కంటి తుడుపుగా వైఎస్ ఈ ప్రకటనను ఉద్దేశించి ఉండవచ్చు. గాని ప్రకటనలోని అక్షరాల మధ్య, వాక్యాల నడుమ దాగున్న అంతరార్ధాలను పసిగట్టటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు.
Pages: 1 -2- News Posted: 12 February, 2009
|