కూటమిలో మ్యూజికల్ చైర్స్
హైదరాబాద్ :మహా కూటమిలోని రాజకీయ నాయకులు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుండడంతో ఆశావహులు ఇప్పుడు వినూత్న వ్యూహం అనుసరిస్తున్నారు. తమ తమ పార్టీలు సీట్ల పంపకంపై ఒప్పందం కుదుర్చుకోక ముందే తెలుగు దేశం పార్టీ (టిడిపి), వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు పలువురు తమ తమ నియోజకవర్గాలలో, ముఖ్యంగా తెలంగాణలోని నియోజకవర్గాలలో మకాం వేస్తున్నారు.
తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల గురించి కొందరు బాహాటంగానే ప్రకటించగా ఇతరులు తమ మద్దతుదారులతో సమావేశం అవుతూ తాము పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాలకు దూరంగా ఉండవలసిందిగా తమ ప్రత్యర్థులకు సందేశాలు పంపుతున్నారు.
ఇక టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తమ కూటమి భాగస్వామ్య పక్షాలన్నిటి కోర్కెలను ఏవిధంగా తీర్చాలో అంతుపట్టడం లేదు. వివిధ జిల్లాల నుంచి టిడిపి మద్దతుదారులు బృందాలుగా చంద్రబాబు నాయుడు దగ్గరకు వస్తూ భాగస్వామ్య పక్షాల కోర్కెలకు తలొగ్గవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, తదితర నియోజకవర్గాల నుంచి టిడిపి నాయకులు చంద్రబాబు నాయుడును కలుసుకుని సీట్ల కోసం టిఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గవద్దని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా నుంచి మరొక టిడిపి బృందం వచ్చి వామపక్షాల కోర్కెలను అంగీకరించవద్దని కోరారు.
Pages: 1 -2- News Posted: 13 February, 2009
|