నల్లమలలో టైగర్ సఫారీ
కర్నూలు : రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి పెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్న నాగార్జున సాగర్ - శ్రీశైలం పులుల అభయారణ్యంలో టైగర్ సఫారీ ఏర్పాటు చేసేందుకు అటవీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సఫారీని కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట, ఆత్మకూరు సమీపంలోని బైరూట్లి నుంచి నిర్వహించేందుకు గల అవకాశాలపై అటవీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజంలో భాగంగా టైగర్ సఫారీ నిర్వహిస్తే పర్యాటకులకు పెద్దపులుల గురించి వివరించడమే కాకుండా వాటినికాపాడుకోవాల్సిన బాధ్యతను భావి తరాల వారికి వెల్లడించే వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేగాక దగ్గరిలోని పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వచ్చే భక్తులు సైతం ఈ సఫారీని సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా అటు ఆలయం, ఇటు సఫారీ సందర్శకుల తాకిడి ఎక్కువవుతుందని భావిస్తున్నారు.
నల్లమల అడవిలో పెద్ద పులులు, చిరుత పులులు ఎక్కువగా తిరుగాడే ప్రాంతంలో టైగర్ సఫారీ పేరుతో వాటి వద్దకు వాహనాల్లో పర్యాటకులను తీసుకెళ్లి సహజ వాతావరణంలో పులలను వారికి చూపిస్తే బాగుంటుందన్న ఆలోచనలో భాగంగానే టైగర్ సఫారీ ఏర్పాట్లకు బీజం వేసినట్లు తెలుస్తోంది. టైగర్ సఫారీలో భాగంగా పర్యాటకులను పులుల వద్దకు తీసుకెళ్లే క్రమంలో అడవిలోని ఇతర జంతువులు, పక్షులు, సెలయేళ్లు తదితర నల్లమల అందాలను చూసే అవకాశాన్ని పర్యాటకులకు కల్పిస్తే మంచి ఆదరణ ఉంటుందని అటవీ శాఖకు చెందిన అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల పులలను, అడవుల అందాలను చూడటమే కాకుండా అడవుల సంరక్షణ, జంతువుల విశిష్టత గురించి ప్రజలకు వివరించి అడవుల సంరక్షణలో వారిని కూడా భాగస్వాములను చేయవచ్చని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టైగర్ సఫారీ కోసం పర్యాటకుల నుంచి ఎంత మేరకు రుసం వసూలు చేయాలి, నల్లమల అడవిలో ఎంత దూరం పర్యాటకులను తీసుకెళ్లాల్సి వుంటుంది, దీనివల్ల ఇతర ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా తదితర అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాకే దీనిపై ఒక నిర్ణయానికి రావచ్చని తెలుస్తోంది. దీంతో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో చర్చలు జరిపి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News Posted: 14 February, 2009
|