కమలనాధుల కలవరం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతాపార్టీ అగమ్య గోచరస్థితిలో వున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏమిటో తేల్చుకోలేకపోతోంది. వ్యూహ రచనకు అనుసరించాల్సిన విధానాలను రూపొందించుకోలేకపోతోంది. వీటికి తోడు అన్ని స్థాయిల్లో నాయకత్వలోపం పార్టీని తీవ్రంగా వేధిస్తోంది. కేవలం అధికారం చేపట్టాలన్న కాంక్ష మాత్రం అగ్ర నాయకుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వరోవైపు బిజెపిని తేరవవెనుకనుంచి నడిపించే సంఘ్ పరివార్ కేంద్రం నాగపూర్ లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా పేలవంగానే ముగిశాయి. అధికారం కోల్పోయి ఐదు సంవత్సరాలు గడచినా, బలమైన ప్రతిపక్షంగా తయారవలేకపోయామని నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. తీవ్రవాదం ప్రదాన అస్త్రంగా విజయం సాధించడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ప్రస్తుతం ప్రజల ముందుకు వెళ్లడానికి ఆ పార్టీకి అజెండా అంటూ లేకుండాపోయింది. ముంబాయి దాడుల తరువాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం బిజెపి ఆత్మస్థైర్యాన్ని బాగా దెబ్బతీసింది.
బిజెపిలో ప్రజాకర్షణగల ఏకైక నాయకుడు అటల్ బిహారి వాజ్పేయి అనారోగ్యంపాలు కావడంతో, ప్రధాని అభ్యర్ధిగా పార్టీ ప్రకటించుకున్న లాల్ కృష్ణ అద్వానీ యాత్రలు తప్ప మరో దారి లేక, ప్రజలను ఎలా ఆకర్షించాలో అర్ధంకాక, తెగ మధనపడిపోతున్నారు. పటిష్టమైన ద్వితీయశ్రేణి నాయకత్వం కొరత, ఉన్నవారికి ప్రజాబలం లేకపోవడంతో పార్టీ నాయకత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గతంలో బీజెపి ఎన్నికలకు ముందే ప్రజలను ఆకట్టుకునే నినాదాలతో, కాంగ్రెసం కంటె ముందే ప్రచారం ప్రారంభించింది. కానీ ఇప్పడు నినాదాలే కాదు అజెండాయే తోచక, జనాన్ని ఏ పేరుతో ఓట్లు అడగాలా అన్న మీమాంసలో పడిపోయింది. చివరి అస్త్రం అన్నట్టు పాత రామాలయ మంత్రాన్ని జపించడం ప్రారంభించింది. ఈ మంత్రానికి ఓట్ల చింతకాయలు ఏ మాత్రం రాలుతాయో ఓటర్లే చెప్పాలి.
పార్టీ అధ్యక్షుడు రాజ్ నాఛ్ సింగ్ రామాలయం గురించి చేసిన ప్రకటనతో హిందూత్వ వాది అద్వానీ ఇరుకున పడ్డారు. అతివాది ముద్రను చెరిపేసుకుని సర్వామోద అభ్యర్ధిగా తెరమీదకు వచ్చి, ప్రధాని కావాలనుకుంటున్న అద్వానీ పార్టీ అధ్యక్షుడి ప్రకటన కారణంగా తనరూటు మార్చుకోవలసిన అగత్యం ఏర్పడింది. హిందూత్వమే తన నినాదమని, రామాలయ నిర్మాణం లక్ష్యమని ప్లేటు ఫిరాయించాల్సి వచ్చింది. ఫలితంగా బిజెపి భాగస్వామ్య పక్షాలు కూడా సందిగ్థంలో పడ్డాయి. నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్.డి.ఎ) కన్వీనర్ గా వ్యవహరిస్తున్న జనతాదళ్ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్, ఎన్నికల ప్రచారంలో బిజెపి రామాలయ నిర్మాణ ప్రస్తావన తీసుకురావడానికి తాను సమ్మతించబోనని పరోక్షంగా చెప్పేశారు. అయితే పొత్తుల చర్చలు ప్రారంభమయ్యాక, అగిన సమయంలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకూ అద్వానీ వర్గానిదే పైచేయి కావడం, మిగతావారు కీలుబొమ్మలు కావడం ఎన్డీఏ మిత్ర పక్షాలకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలపై ఆ పార్టీ నాయకత్వానికి ఆశలు సన్నగిల్లిపోతున్నాయి.
News Posted: 15 February, 2009
|