జనావాసంలో తమిళ'పులి'
కొలంబో: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(ఎల్.టి.టి.ఇ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా ప్రత్యర్ధుల అదుపులో వున్న ప్రాంతంలోనే చిక్కుకుని వున్నట్టు భద్రతా సిబ్బందికి పట్టుబడిన ఆత్మాహుతి దళం సభ్యులు ఇద్దరు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాకరన్ కుమారుడు చార్లెస్ ఆంథోని శ్రీలంక సైన్యంతో పోరులో ఎల్.టి.టి.ఇ దళాలను ముందుండి నడిపిస్తున్నట్టు వారు చెప్పారు. ప్రస్తుతం మిగిలి వున్న ఎల్.టి.టి.ఇ సైన్యానికి ఆంథోని నాయకత్వంవహిస్తున్నాడని బ్లాక్ టైగర్స్ గా వ్యవహరించే తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం సభ్యులైన ఈ ఇద్దరు ఇంటరాగేషన్ లో వెల్లడించారు. ప్రభుత్వ సైన్యానికి బ్లాక్ టైగర్లు సజీవంగా పట్టుబడడం చాలా అరుదు. అలాగే వాళ్లు లొంగిపోవడం ఇంకా అరుదు. ఇరవయ్యేళ్ల వయసున్న ఈ ఇద్దరూ ఈశాన్య ప్రాంతంలోని ముల్లైతీవు జిల్లా తెరుమురుకాండి వద్ద జనవరి 28న లొంగిపోయారని సైన్యం చెబుతోంది.
ఆ ప్రాంతంలో వున్న ఇరనమదు చెరువు గట్టును పేల్చివేయడానికి ఈ బ్లాక్ టైగర్లు విఫలయత్నం చేసి, ప్రభుత్వ దళాలకు లొంగిపోయారని, వారి ప్రయత్నం ఫలించి వుంటే భారీ విధ్వంసం జరిగి వుండేదని సండే అబ్జర్వర్ పత్రిక పేర్కొంది. వారు చెప్పిన మాటలను బట్టి, ప్రభాకరన్ భార్యను, పదేళ్ల చిన్న కుమారుడిని గుర్తు తెలియని సురక్షిత ప్రాంతానికి పంపించేశాడు. అతడి కుమార్తె ధురహ(20), మరో కుమారుడు బాలచంద్రన్ కూడా అజ్ఞాతంలోనే వున్నారు. పెద్ద కుమారుడు ఆంథోని ఐర్లండ్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడై 2006లో స్వదేశానికి తిరిగి వచ్చి, ఎల్.టి.టి.ఇ వైమానిక దళానికి, కంప్యూటర్ విభాగానికి సారథ్యంవహిస్తున్నట్టు పత్రికల్లో వార్తల ద్వారా తెలిసింది. ఎల్.ట్.ట్.ఇ వైమానిక దళాన్ని పటిష్టం చేయడంలో అతడు కీలకపాత్ర పోషించాడట.
News Posted: 15 February, 2009
|