స్పోర్టివ్ 'స్పిరిట్'!
హైదరాబాద్: ఆస్ట్రేలియా తరహా స్టేడియాలు హైదరాబాద్ మహానగరంలో దర్శనమివ్వబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(స్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-శాప్)కు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఇందుకోసం నైతిక విలువలను వదులుకోడానికి సిద్ధపడింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన స్టేడియంలలో ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడమే ఇందుకు కారణమని చెబుతూ, బీరు, వైన్ వంటి ఆల్కహాలు శాతం తక్కువగా వుండే మత్తుపానీయాలను స్టేడియాలలోకి అనుమతించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే నగరంలోని లాల్ బహదూర్ స్టేడియం, గచ్చిబౌలి, కోట్లవిజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసఫ్ గూడ, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలలో క్రీడాభిమానులు చేతుల్లో బీరు, వైన్ గ్లాసులతో ఆటలను ఎంజాయ్ చేస్తారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన క్రీడా వనరులను లాభదాయకంగా మార్చుకోవాలంటే స్టేడియంలలో ఆల్కహాలు శాతం తక్కువగా వుండే మత్తుపానీయాల విక్రయాన్ని అనుమతించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని సూచిస్తూ శాప్ మేనేజింగ్ డైరక్టర్ వికాస్ రాజ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటువంటి సౌకర్యాలు లేకుండా స్టేడియాలను అద్దెకు తీసుకోడానికి ఎవరూ ఆసక్తి కనబరచడం లేదని, ఫలితంగా శాప్ కు ఆదాయం తగ్గిపోవడమే కాకుండా, స్టేడిసంలు కూడా నిరుపయోగమైపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు.
శాప్ ఎండి సిఫార్సు ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వ యూత్ అడ్వాన్స్ మెంట్, టూరిజం, సాంస్కృతిక(స్పోర్ట్స్) వ్యవహారాల విభాగం, హైదరాబాద్ లోని శాప్ స్టేడియాలలో పోటీలు జరిగే సందర్భాలలో 'లో ఆల్కహాల్ బెవరేజెస్' విక్రయాలకు అనుమతిస్తూ ఫిబ్రవరి 13న ప్రభుత్వ ఉత్తర్వు(జి.ఒ. ఎం.ఎస్.నెం.6)ను జారీచేసింది. ప్రస్తుతం నగరంలోని శాప్ స్టేడియాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, మరింతమంది వాటిని వినియోగించుకునే విధంగా ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వికాసం రాజ్ ఒక పత్రిక ప్రతినిధికి చెప్పారు. స్టేడియాల ఆవరణల్లో లిక్కర్ విక్రయానికి అనుమతించాలని అనేక సంఘాల ఆర్గనైజర్లు విజ్ఞప్తి చేశారని, ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసిఎల్)తదితర గ్రూప్ లు తక్కువ శాతం ఆల్కహాలు గల మత్తుపానీయాలను స్టేడియంలలో విక్రయించాలని కోరాయని, దీనివల్ల వివిధ క్రీడా సంఘాలు తమ పోటీలను శాప్ స్టేడియాలలో నిర్వహించడానికి ఆసక్తి కనబరుస్తాయని తాము కూడా భావించామని ఆయన తెలిపారు.
ఈ నిర్ణయం అమలులోకి వచ్చాక, స్టేడిసంను అద్దెకు తీసుకునే నిర్వాహకులు ఆల్కహాలు మొత్తం విక్రయాలలో 30 శాతం శాప్ కు చెల్లించాల్సి వుంటుంది. అయితే దానికి ముందుగా ఆయా నిర్వాహకులు ఎక్సైజ్ అధికారులనుంచి తగు పర్మిషన్లు, పర్మిట్లను పొందాల్సి వుంటుందని శాప్ అధికారులు స్పష్టం చేశారు.
News Posted: 16 February, 2009
|