పార్టీల గబ్బు మీడియాకు డబ్బు
హైదరాబాద్: ప్రస్తుతం దాదాపు అన్ని న్యూస్ చానల్స్ లో రెండు కోడిప్లల్లు మాట్లాడుకుంటున్నట్టు అడ్వర్టయిజ్ మెంట్ ను చూస్తున్నాం. ఈ రాజకీయ ప్రకటనకు రెండు నెలల్లో ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చయ్యాయంటే ఆశ్చర్యమే. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఈ కోడిపిల్లల ప్రకటనను టీల్లో ప్రసారంచేయడానికి చెల్లించింది నల్లడబ్బు కాదట. చేయూత అనే సంస్థ పేరిట ఈ ప్రకటనలు వస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఈ ప్రకటను ఆ పార్టీయే రూపొందించింది. రెండు కోడిపిల్లలు కాంగ్రెస్ అవినీతి పాలన గురించి, ముఖ్యమంత్రి వైఎస్, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిల అవినీతి గురించి, చిరంజీవి గురించి మాట్లాడుకుంటుంటాయి.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఇటువంటి ప్రకటనల ప్రసారం సాధ్యంకాదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంకోసం ఖర్చుపెట్టిన ప్రతి పైసాకు లెక్క చూపాలి. ఆయా ప్రకటనలు కూడా ఎన్నికల నిబంధనలకు లోబడి వుండాలి. అందువల్లనే ఎన్నికల నోటిఫికెషన్ వెలువడే ముందే విస్తృత ప్రచారం కోసం ఈ కోడిపిల్లల ప్రకటనను తెలుగుదేశం ఉపయోగించుకుంటోంది. అవినీతి అక్రమాలపై తాను చెప్పదలచుకున్నదంతా ఈ ప్రకటన రూపంలో విడుదల చేసింది.
కోడిపిల్లల ప్రకటనకు వైట్ మనీ రూపంలో చెల్లించిన మొత్తమే ఏడున్నర కోట్ల రూపాయలైతే, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందే ప్రకటనలకు ఎంతెంత మొత్తాలు ఖర్చుచేస్తున్నాయో అర్ధమవుతుంది. దీనికి పోటీగా కాంగ్రెస్ కూడా కొన్ని ప్రకటనలను తయారుచేసింది. ప్రభుత్వపరంగా విడుదలచేసే ప్రకటనల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను పేర్కొంటుండగా, పార్టీ ఆధ్వర్యంలో విడుదలచేసే ప్రకటనల్లో కొన్ని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ, మరికొన్ని దేశం ప్రకటనలకు సమాధానం చెబుతున్నట్టుగా రూపొందించారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు కోడిపిల్లల ప్రకటనకు కోడిపిల్లల రూపంలో గుంటనక్కలు అనే ప్రకటన విడుదలచేశారు.
మరోవైపు రాష్ట్రంలో సమస్యలను బ్లాక్ అండ్ వైట్ లో చూపుతూ ఈ సమస్యల పరిష్కారానికి మార్పే సమాధానమని చెబుతున్నట్టుగా ప్రజారాజ్యం పార్టీ ప్రకటన విడుదలచేసింది. ఏది ఏమైనా, రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారయుద్ధం, ప్రకటనల పరంపర ఎలక్ట్రానిక్ మీడియాకు కనకవర్షం కురిపిస్తున్నాయి.
News Posted: 19 February, 2009
|