పెట్టుబడి, పలుకుబడి
హైదరాబాద్: అన్ని రంగాలపై ప్రతిఫలిస్తున్న ఆర్ధికమాంద్యం ప్రభావం ఎన్నికలకోసం పార్టీలు చేస్తున్న ఖర్చుపై అంతగా కనిపించే అవకాశాలు లేవు. ఎన్నికలను అత్యంత ఖరీదైన వ్యవహారంగా రాజకీయ పార్టీలు మార్చేశాయి. మరో రెండు నెలల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. వీటికోసం విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు అభ్యర్ధులను ఎంపికచేస్తున్నాయి. లోక్ సభకు టిక్కెట్ ఇచ్చేందుకు అభ్యర్ధులు పెట్టే ఖర్చు, అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చేందుకు స్థానికంగా ప్రజలలో వున్న పలుకుబడి ప్రధాన అర్హతలుగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వెయ్యి కోట్ల రూపాయల వంతున ఖర్చుపెట్టనున్నాయి. తమకు టిక్కెట్ ఖాయమనుకుంటున్న ఆయా పార్టీల అభ్యర్ధులు కొంతమంది అప్పుడే నిధుల సేకరణ మొదలుపెట్టారు.
కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు ఒంటరిగా పోటీచేస్తున్నందున 42 లోక్ సభ, 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఎంపికచేయాల్సి వుంది. ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున మూడునుంచి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టవలసి వస్తుంది. అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వుండే ఒక్కొక్క లోక్ సభ నియోజకవర్గంలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలన్న మాట. తమ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే పార్టీ అభ్యర్ధులకు కొంతమేర డబ్బు సర్దుబాటు చేయవలసిన బాధ్యత లోక్ సభ అభ్యర్ధులమీద వుంది. అందువల్ల ఆర్ధికంగా బలంగా వున్నవారికే లోక్ సభ టిక్కెట్లు ఇవ్వడానికి ప్రదాన పార్టీలు ప్యత్నిస్తున్నాయి. స్థానికంగా వుండే పలుకుబడి కంటె ఆర్ధిక స్తేమతు బాగా వున్నవారికే లోక్ సభ అభ్యర్ధుల ఎంపికలో పార్టీలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల విషయంలో అంగబలం కంటె స్థానికంగా ప్రజల్లో పలుకుబడి వున్నవారికే ప్రధాన పార్టీలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఒక్ొక్క అయెంబ్లీ నియోజకవర్గానికి సగటున నాలుగు కోట్ల రూపాయల వరకు ఖర్చుకావచ్చని అంచనా వాశారు. ఇందులే కొంతశాతం లోకం సభ అభ్యర్ధులు భరిస్తారు కాబట్టి అసెంబ్లీ అభ్యర్ధులపై ఆ మేరకు భారం తగ్గుతుంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం మూడుకోట్ల రూపాయల ఖర్చవుతుందనుకున్నా, ఒక పార్టీ అన్ని నియోజకవర్గాలకు పోటీ చేసినట్లయితే ఖర్చుపెట్టే మొత్తం 900 కోట్ల రూపాయలవుతుంది. ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి కాబట్టి, అంగబలం కంటె ప్రజల్లో మంచి పలుకుబడి వున్నవారికే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
లోక్ సభ టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులను ఆయా పార్టీలు అడిగే మొదటి ప్రశ్న ఎంతవరకు ఖర్చుపెట్టగలరన్నదే. అదే అసెంబ్లీ టిక్కెట్ల విషయంలో అయితే నియోజకవర్గ ప్రజల్లో ఎంత పలుకుబడి వుంది, పేరు ప్రతిష్టలెలా వున్నాయి, కులంబలం ఎంత అన్న అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
News Posted: 20 February, 2009
|