పోస్టాఫీసుకు కొత్త కళ
న్యూఢిల్లీ: తళతళలాడే కార్పొరేట్ స్టైల్ స్టీల్ చైర్స్ పై కూర్చొని అత్యాధునిక ఫ్లాట్ స్కాన్ కంప్యూటర్లపై పనిచేస్తూ వినియోగదారలకు కావలసిన సమాచారాన్నిమడత నలక్కుండా కళ కళలాడే డ్రస్సుల్లో చురుకుగా వేగంగా నవ్వుతూ అంచించే సిబ్బందితో కూడిన ఒక ఎమ్ఎన్ సి ఆఫీసును తలపింప చేసే విధంగా జెంషడ్ పూర్ హెడ్ పోస్టాఫీసు ముస్తాబయ్యింది. అక్కడకే పరిమితమని తలిస్తే పప్పులో కాలేసినట్లే. ఇలాంటి ఆధునిక హంగులతో దేశవ్యాప్తంగా 5 వేల పోస్టాఫీసులను జులై నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
నెరసి చెదరిన జుట్టు, భూతద్దాల్లాంటి కళ్లద్దాలు; పని ఒత్తిడితో, మూస పని పద్దతితో అలసి, వాడిపోయిన ముఖం; ఇంకు కారి ఊరిన జేబులతో తల వంచుకు పనిచేసుకునే సిబ్బంది; ఉసూరు మంటూ రంగు వెలసి వేలాడుతున్న పోస్టు డబ్బా; బ్రిటీష్ కాలంనాటి నల్లగా మురికి తేలిన చెక్క బల్లలు, కుర్చీలు; పాత వాసనలతో, కవరు కంపుతో, గోడలపై, టేబుళ్లపై అసహ్యమైన బంక మరకలతో ఊసురోమంటున్న వాతావరణంలోని భారతీయ పోస్టాఫీలను పోల్చుకోలేని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. మారిన పరిస్థితుల రీత్యా పోస్టాఫీసులు కూడా ఆధునిక హంగులు సంతరించుకోనున్నాయి.
కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటి మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రాజెక్ట్ యారో (పిఏ) పథకంతో పోస్టాఫీసుల కళ పూర్తిగా మారిపోయేట్లుంది. ఇప్పటికే 500 పోస్టాఫీసుల ఆధునిక కార్పొరేట్ హంగుల్ని సంతరించుకున్నాయి. ప్రాజెక్ట్ ఏ పథకం క్రింద పోస్టాఫీసులను అత్యాధునిక కార్పొరేట్ ఆఫీసుల్లోని హంగులతో రూపొందిస్తారు. ఈ పోస్టాఫీసుల్లో ఇంటర్నెట్ కియోస్కులతో సహా పలు సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టాఫీసులకు పోవాలంటే యువతరం విముఖంగా ఉంది. ఇలాంటి కార్పొరేట్ హంగులతో వినియోగదారులను ఆకర్షంచేందుకు పోస్టాఫీసులు రూపు రేఖల్ని మార్చుకుంటున్నాయని కమ్యూనికేషన్స్, ఐటి మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు.
Pages: 1 -2- News Posted: 20 February, 2009
|