ఎంపిల భత్యాలు యథాతథం
న్యూఢిల్లీ : ప్రస్తుత లోక్ సభ గడువు వచ్చే వారం ముగిసిన తరువాత ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం సభను రద్దు చేయదు. అంటే సభలో ఇప్పుడు ఉన్న 506 మంది సభ్యులూ తదుపరి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నోటిపై చేసేంత వరకు ఎంపిలుగా తమ జీతాలను అందుకుంటూ, సదుపాయాలను అనుభవిస్తారన్నమాట. అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా కూడా వారికి చెల్లింపులు జరుగుతాయన్నమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వారు చేసేది ఏమీ ఉండదు. శాసన సంబంధమైన పని కూడా వారేమీ చేయరు.
'2004లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) ప్రభుత్వం ముందుగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకున్నందున సభను రద్దు చేసింది. అసలు ఎన్నికలు 2004 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య జరగవలసి ఉంది. కాని ఏప్రిల్, మే మధ్య నిర్వహించారు. అయితే, ఇప్పుడు అటువంటి నిర్బంధాలేమీ లేవు. లోక్ సభను ఎందుకు రద్దు చేయాలి?' అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ 'బిజినెస్ స్టాండర్డ్' విలేఖరితో అన్నారు.
'లోక్ సభను వెంటనే రద్దు చేయవలసిన అగత్యం ఏమీ లేదు' అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వాయలార్ రవి అన్నారు.
ప్రస్తుతం స్పీకర్ సహా 506 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. బహిష్కరణల వల్ల గాని, ఇతర కారణాలతో గాని 39 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ప్రస్తుత లోక్ సభ కొనసాగుతున్నది కనుక స్టాండింగ్ కమిటీలు కూడా తమ నివేదికలకు సంబంధించిన బాధ్యతలను కొనసాగించి, స్పీకర్ కు నేరుగా వాటిని పంపగలవు. అయితే, సభ్యులు రానున్న ఎన్నికలకు సన్నద్ధం అవుతూ ఉంటారు కనుక వారు కమిటీ పనికి ఎంత సమయాన్ని కేటాయిస్తారనేది సందేహమే.
రూ. 16 వేల నెల జీతం కాకుండా లోక్ సభ సభ్యులు అలవెన్సులు, ప్రయాణ, వైద్య సౌకర్యాలు, వసతి, టెలిఫోన్లు వంటి సదుపాయాలను పొందుతుంటారు. ఎంపిల జీతాలను 2006 సెప్టెంబర్ లో రూ. 12 వేల నుంచి రూ. 16 వేలకు పెంచారు. కమిటీ సమావేశానికి హాజరైనందుకు వారికి రూ. 1000 దిన భత్యం చెల్లించవలసి ఉంటుంది. వారికి నియోజకవర్గం అలవెన్స్, నెలకు రూ.20 వేల మేరకు ఆఫీసు ఖర్చుల అలవెన్సులు, ప్రయాణ రాయితీలు కూడా లభిస్తాయి.
లోక్ సభ సభ్యత్వం కొనసాగినంత కాలం ప్రతి సభ్యుడు ఢిల్లీలో వసతి పొందడానికి అర్హుడవుతారు. ఒక్కొక్క సభ్యునికి ఈ నివాసంలో ఏడాదికి నాలుగు వేల కిలో లీటర్ల వరకు నీటిని, 50 వేల యూనిట్ల (లైట్ మీటర్ పై 25 వేల యూనిట్లు, పవర్ మీటర్ పై 25 వేల యూనిట్లు లేదా పూల్ చేస్తారు) వరకు విద్యుచ్ఛక్తిని ఉచితంగా సరఫరా చేస్తారు.
2004లో ఎన్ డిఎ ప్రభుత్వం సభను రద్దు చేసిన తరువాత కొత్త సభ్యులు వచ్చేంత వరకు తమ గృహాలలోనే కొనసాగేందుకు ఎంపిలను అనుమతిస్తూ అది ప్రత్యేక ఉత్తర్వు జారీ చేసింది.
ఇక ఒక్కొక్క ఎంపి ఏడాది కాలంలో తన టెలిఫోన్ లో నుంచి 50 వేల లోకల్ కాల్స్ చేసుకోవడానికి అర్హుడు. పార్లమెంటరీ కమిటీల చైర్మన్లు ఢిల్లీలోని తమ నివాసాలలో ఏర్పాటు చేసిన టెలిఫోన్లలో నుంచి చేసిన కాల్స్ అన్నీ ఉచితమే.
News Posted: 21 February, 2009
|