అర్జున్ పుత్రికోత్సాహం
భోపాల్: రానున్న లోక్ సభ ఎన్నికలలో కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ కుమార్తె వీణకు కాంగ్రెస్ టిక్కెట్ సంపాదించడానికై ఆయన మద్దతుదారులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నేపాల్ కు చెందిన రాజకుమారి దేవయానిని వివాహమాడిన ఐశ్వరీయ సింగ్ తల్లి అయిన వీణ మధ్య ప్రదేశ్ రేవాంచల్ ప్రాంతంలోని సాత్నా స్థానం నుంచి రాజకీయ అరంగేట్రం చేయాలని కోరుకుంటున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) సమావేశంలో ఆమె పేరు చర్చకు వచ్చింది. ఇక సోనియా గాంధి ఆమోదముద్ర లభించవలసి ఉంది.
దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, సురేష్ పచౌరి వంటి మధ్య ప్రదేశ్ కు చెందిన పార్టీ నాయకులు వీణ అభ్యర్థిత్వానికి అభ్యంతరం లేవదీయలేదని, తమ తమ ఫేవరైట్లకు కూడా అటువంటి మినహాయింపును పొందడం వారి ధ్యేయం కావచ్చునని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వీణ అభ్యర్థిత్వాన్ని సింధియా సమర్థించడానికి మరొక కారణం కూడా ఉంది. దేవయాని ఆయనకు సమీప బంధువే. కాగా, అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ కు ఎంఎల్ఎ నుంచి ఎంపిగా పదోన్నతి కోసం ప్రయత్నించకుండా ఆయన శిబిరం రాజకీయాలకు కొత్త అయిన ఆయన కుమార్తె కోసం ఎందుకు ప్రచారం చేస్తున్నదోనని డిల్లీలో కాంగ్రెస్ వర్గాలు ఆలోచనలో పడ్డాయి.
రాహుల్ భయ్యాగా సుపరిచితుడైన అజయ్ మధ్య ప్రదేశ్ చుర్హత్ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంఎల్ఎ. 2008 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలలో రేవాంచల్ ప్రాంతంలోని 30పై చిలుకు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకైక అభ్యర్థి అజయ్.ఈ ప్రాంతం కాంగ్రెస్ కు ఒకప్పుడు పెట్టనికోటగా ఉండేది. ఐశ్వరీయ, దేవయానిల వివాహానికి అజయ్ హాజరు కాకపోవడాన్ని బట్టి తండ్రీ కుమారుల మధ్య సత్సంబంధాలు ఉండి ఉండకపోవచ్చునని కాంగ్రెస్ నాయకులు కొందరు అభిప్రాయం వెలిబుచ్చారు.
Pages: 1 -2- News Posted: 23 February, 2009
|