జనాలకు చిరంజీవి పిచ్చి
హైదరాబాద్ : అభిమానం ఉన్మాద స్థాయికి చేరిన దృశ్యాలు... తెర వేల్పులను నిజ జీవితంలో దేవుళ్ళుగా కొలుస్తారనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు... అవధులు లేని ప్రేమ... ప్రాణాలను సైతం లెక్క చేయని తెగింపు... వయో భేదం అడ్డంకి లేదు... ఆడా మగా తారతమ్యాలు కానరాలేదు... ఒక్కసారి...ఒకే ఒక్కసారి... అరెరే వీలయితే ఎన్నిసార్లయినా చూడాలన్న, ఆ మాటలు వినాలన్న తపన. అదృష్టం వరిస్తే క్షణంలో వెయ్యో వంతు సమయమైనా ఆ చేతిని తాకాలన్న పట్టుదల...పోనీ కనీసం ఒక్కసారి తన వైవు ఆయన చూపు ప్రసరించక పోతుందా అన్న ఆశ. అంతే కేవలం దానికోసమే అలుపు లేకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా కిలోమీటర్ల పరుగులు... తిండీ తిప్పలూ మానేసి మండే ఎండల్లో గంటల కొద్దీ ఎదురుచూపులు. ప్రజారాజ్యం పార్టీ అధినేత, అశేష ఆంధ్రుల అభిమాన నటుడు, మెగాస్టార్ చిరంజీవికి కర్నూలు జిల్లాలో అడుగడుగునా అభిమానులు చూపించిన ఆదరణ అనిర్వచనీయం. ఐదు రోజుల పాటు సాగిన ప్రజా అంకిత యాత్ర రోడ్ షో లు జాతరలను మరపించింది.
ఉప్పెన, సునామీ లాంటి పదాలు కూడా సరిపోవా అన్నట్టు రహదారుపై జనవాహిని. కట్టలు తెగిన వరద గోదావరిలా... కాదేమో, అవధులను కూల్చేస్తూ విరుచుకు పడిన సముద్రంలా... ఇదీ కాదేమో, మిన్ను విరిగి నేలపై పడినట్టు అనవచ్చేమో. ఇవన్నీ కావు... జనాలకు చిరంజీవి పిచ్చి. చిరంజీవి కోసం చచ్చేంత పిచ్చి. వచ్చిన వాళ్ళంతా వోటేస్తారా? అనే రాజకీయాల ప్రస్తావన ఇక్కడ చేయనక్కర్లేదు. కేవలం చిరంజీవి తమ పట్టణానికి, గ్రామానికి వస్తున్నాడన్న కబురు కర్నూలు జిల్లా ప్రజలను మైకంలో ముంచేసింది. వ్యామోహంలో పడేసింది. చిరంజీవి సమ్మెహన శక్తికి ప్రతీకగా నిలచింది. నిరూపించింది. డోన్ పట్టణం నుంచి ఈనెల 18న యాత్ర ప్రారంభం అయింది లగాయతు ఆదివారం రాత్రి ఎమ్మిగనూరులో ముగింపు పలికే వరకూ చిరు ప్రభంజనం అప్రతిహాతంగా కొనసాగింది. నిర్విరామ సముద్రఘోష లా ప్రజల కేరింతలు, అరుపులు, కేకలు, హర్షద్వానాలు, నినాదాల, చప్పట్లు, బాజాల మోతలు, డప్పుల కోలాహలంతో మార్మోగిపోయింది. ప్రజల నుంచి లభించిన అపూర్వ ఆదరణ చిరంజీవిని సైతం విచలితుణ్ణి చేసింది. ఆయన ప్రసంగాలు ఉద్వేగాన్ని సంతరించుకున్నాయి. `ఈ ప్రేమానురాగాలు చాలు ఈ జీవితానికి. నాకు అధికారం వద్దు. నేను ఏ ఇంటి ముందు నిలబడి ఆకలేస్తుందంటే నన్ను కన్నబిడ్డలా ఆదరించి కడుపు నిండా అన్నం పెట్టని అమ్మలెవరైనా ఉంటారా? మనిషికి ఇంతకంటే కావాల్సిందేముంటుంది' అంటూ వైరాగ్యాన్నీ ప్రదర్శించేంతంగా చలించిపోయారు.
Pages: 1 -2- News Posted: 23 February, 2009
|