ఆరు విడతలుగా పోలింగ్?
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికలు ఐదు లేక ఆరు దశలుగా జరిగే అవకాశం ఉందని, ఎన్నికల విధుల నిర్వహణకు అందుబాటులో ఉండే పారా మిలిటరీ సిబ్బంది తక్కువ మందే కావడం ఇందుకు కారణమని అధికార వర్గాలు సూచించాయి. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ అధికారుల బృందం ఎన్నికల కమిషనర్లను కలుసుకుని పోలింగ్ రోజులను సాగదీయవలసిందిగా కోరింది. కేంద్ర భద్రతా సిబ్బందిని ఎన్నికల సమయంలో కల్లోలిత ప్రాంతాలు, తీవ్రవాద బాధిత ప్రాంతాలలో నియోగించవలసి ఉంటుందని అధికారుల బృందం ఇసికి సూచించింది.
అంటే, ఎన్నికల విధుల కోసం సమకూర్చే భద్రతా సిబ్బంది సంఖ్యలో గణనీయమైన కోత ఉంటుందన్న మాట. హోమ్ మంత్రిత్వశాఖ 'విధానంలో మార్పు'నకు ముంబై ఉగ్రవాదుల దాడులు కారణమని ఆ వర్గాలు వివరించాయి. అయితే, బహుళ దశలలో ఎన్నికలు నిర్వహించడం రాజకీయ పార్టీలకు రుచించదు. బోర్డు పరీక్షలు, జాతీయ, రాష్ట్రీయ సెలవు దినాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత పోలింగ్ ప్రక్రియను సాధ్యమైనంతగా కుదించవలసిందని ఎన్నికల కమిషన్ ను పలు రాజకీయ పార్టీలు కోరాయి.
గతంలో ఒకే రోజు పోలింగ్ నిర్వహించిన రాష్ట్రాలలో ఈసారి కూడా ఒకే రోజు పోలింగ్ ను నిర్వహించాలని ఫిబ్రవరి 3న జరిగిన సమావేశంలో ఈసీకి పార్టీలు సూచించాయి. అయితే, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేట్లు చూసేందుకు కేంద్ర భద్రతా సిబ్బందిని నియోగించడం ప్రధానమనే అభిప్రాయంతో చాలా వరకు పార్టీలు ఏకీభవించాయి.
ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మార్చి 1న లేదా ఈ వారాంతానికి వెల్లడి కాగలదు. ఎన్నికల కార్యక్రమాన్ని అప్పటికి ప్రకటించవచ్చునని ఆ వర్గాలు సూచించాయి. అదే జరిగిన పక్షంలో ఎన్నికల ప్రక్రియ మే మొదటి వారంలో మొదలవుతుంది. అప్పుడు ఆ నెలాఖరుకల్లా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తగినంత వ్యవధి ఉంటుంది.
Pages: 1 -2- News Posted: 25 February, 2009
|