సోనియా 'డెడ్ లైన్'!
న్యూఢిల్లీ: ఎన్నికలకు సంబంధించిన పనులను మార్చి మధ్య భాగానికల్లా పూర్తిచేయాలని తన బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాన్ని ఈ వారాంతంలోగా ప్రకటించే అవకాశం ఉండడంతో వచ్చే గురువారానికల్లా ప్రాథమిక కార్యక్రమాలను పూర్తిచేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శులను అభ్యర్థుల స్క్రీనింగ్ బృందాల చైర్ పర్సన్లను సోనియా ఆదేశించారు. దీని వల్ల మార్చి 15 లోగా కేంద్ర ఎన్నికల కమిటీ మొత్తం వ్యవహారాలను చక్కబెట్టగలదని ఆమె అభిప్రాయం.
ప్రస్తుత మిత్ర పక్షాలతోను, కాబోయే మిత్ర పక్షాలతోను చర్చలను సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలని సోనియా మంగళవారం తన బృందంతో జరిపిన సమావేశంలో కోరారు. ఈ బృందంలో సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, సుశీల్ కుమార్ షిండే, ఎ.కె. ఆంటోనీ, వాయలార్ రవి కూడా ఉన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి)తో సంప్రతింపులు జరపవలసి ఉన్న మహారాష్ట్ర సబ్ కమిటీ సభ్యుడైన సుశీల్ కుమార్ షిండే మంగళవారం రాత్రి రాష్ట్ర ఎంపిల కోసం డిన్నర్ నిర్వహించారు.
పార్టీ ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేసేందుకై మార్చి 6 నుంచి రోజూ సమావేశం కాగలదని భావిస్తున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ సమావేశాలకు హాజరు కావచ్చు. అయితే, ఆయన కొద్ది సేపే సమావేశాలలో పాల్గొంటారు.
లాబీయింగ్ కు, తిరుగుబాటు ధోరణులకు అవకాశాలు లేకుండా చేయడానికై అభ్యర్థుల పేర్లను నామినేషన్ తేదీలకు దగ్గరగా ప్రకటించాలని సోనియా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ (ఎస్ పి)తోను, బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ (టిసి)తోను వచ్చే వారం లేదా ఆ ప్రాంతంలో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటారా అని మీడియా ప్రశ్నించినప్పుడు ఇంకా సాగవలసిన 'దూరం కొంత' ఉందని పార్టీ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ 'ప్రహసనం' తమకు అంతుపట్టడం లేదని వారు అంగీకరించారు. ఆ రాష్ట్రంలో రెండు పార్టీలు వంతుల వారీగా పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
Pages: 1 -2- News Posted: 25 February, 2009
|