అజార్ ఉభయతారక మంత్రం
హైదరాబాద్: తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకి గడ్డి కోసం అన్నాడట వెనకటికెవరో. అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాడంటే తన మీద ఉన్న క్రికెట్ బహిష్కారాన్ని రద్దు చేయించుకోడానికి అంటున్నారు ఆంతరంగికులు. ఎన్నికల ప్రచారంలో ఈ మాజీ కెప్టెన్ ను ఉపయోగించుకుని ఓట్లు రాల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, బహిష్కారాన్ని రద్దుచేయమని బిసిసిఐకి సిఫార్సు చేయించుకోవాలని అజార్ తాపత్రయపడుతున్నాడట. ఉభయతారకం. ఇంతకుముందు అందరూ అనుకున్నట్టుగా, కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో నిజామాబాద్ నుంచో మరో చోట నుంచో ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన అజారుద్దీన్ కు లేదట.
'తాను టీమ్ ఇండియా కెప్టెన్ కాదనీ, కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటాననీ అజారుద్దీన్ చెప్పాడు. ప్రస్తుతానికి ఆయన్ను ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటారు. అక్కడ ఆయన కనిపిస్తే చాలు ఓట్ల వర్షం కురుస్తుంది' అని పార్టీ నాయకుడొకరు చెప్పారు. అయితే, అజార్ కు ఎన్నికల ప్రచారం కంటె బహిష్కార శిక్షను రద్దు చేయించుకోవడం ముఖ్యం. గతంలో టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణపై అతడిని బిసిసిఐ బహిష్కరించిన విషయం విదితమే. ఈ ఉత్తర్వు ప్రకారం మహమ్మద్ అజారుద్దీన్ అధికారిక పోటీల్లో పాల్గొనకూడదు సరికదా, ప్రచార(ప్రమోషనల్) కార్యక్రమాలకూ దూరంగా ఉండాలి. కనీసం కామెటరీ కూడా చెప్పకూడదు.
Pages: 1 -2- News Posted: 26 February, 2009
|