బంగ్లా మ్యూటినీలో ఐఎస్ఐ?
కోలకతా : ఇటీవలి కాలంలో ప్రపంచంలో అత్యంత దారుణమైన తిరుగుబాటుగా పేర్కొనదగిన బంగ్లాదేశ్ రైఫిల్స్ (బిడిఆర్)లో జరిగిన తిరుగుబాటుకు మూలాలు బెంగాల్, మిగిలిన భారతదేశం మరవజాలని సంఘటనలో, అదే 1971 విమోచన యుద్ధం నాటివి కావచ్చు.
ఇప్పటికీ ఇస్లామాబాద్ తో మిత్రత్వం నెరపుతున్న 1971 నాటి పాకిస్తాన్ తొత్తులను శిక్షించేందుకు షేక్ హసీనా ప్రభుత్వం కృతనిశ్చయంతో చేస్తున్న యత్నాలకు విఘాతం కలిగించడానికే బిడిఆర్ లో ఈ తిరుగుబాటును జరిపించి ఉండవచ్చునని అభిజ్ఞ వర్గాల అభిప్రాయం. ఈ సంఘటనలో సైనికాధికారులు, ఇతరులు పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.
'ముందుగా రూపొందించిన వ్యూహం' ప్రకారమే ఈ తిరుగుబాటు జరిగిందని, ఈ వ్యూహం అమలుకు 'మిలియన్ల కొద్దీ టాకాలు' వెచ్చించారని బంగ్లాదేశ్ ప్రభుత్వం శుక్రవారం తెలియజేసింది. అయితే, ఎవరిపై అనుమానం ఉందో అధికారికంగా వెల్లడి చేయలేదు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపే ఆరుగురు సభ్యుల కమిటీకే ఈ బాధ్యతను వదలివేశారు.
అయితే, ఈ తిరుగుబాటులో 'ఐఎస్ఐ హస్తం' ఉందని తాము భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. 'ఈ వివాదానికి కారణంగా ముందు పేర్కొన్న వేతనం, భత్యాల సమస్యలు ఇంతటి తిరుగుబాటుకు, అంత మంది అధికారుల హత్యకు దారి తీసేంతటి తీవ్రమైనవి కావు' అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
'యుద్ధ నేరస్థులను' శిక్షించాలనే ప్రతిపాదన ఈ తిరుగుబాటుకు అసలు కారణం కావచ్చునని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అవామీ లీగ్ తన ఎన్నికల ప్రణాళిలో చేసిన అత్యంత ముఖ్యమైన వాగ్దానాలలో ఒకటి 'యుద్ధ నేరస్థులను' శిక్షిస్తామనడం.
రెండు నెలల క్రితం ఎన్నికలలో అఖండ విజయం అనంతరం అధికారంలోకి వచ్చిన అనంతరం షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ 'యుద్ధ నేరస్థులు' అందరిపై విచారణ జరిపి, వారిని శిక్షించాలని కోరుతూ పార్లమెంట్ లో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది.
'యుద్ధ నేరస్థులు' అనేక మంది ఇప్పుడు మత ఛాందసవాదం మిక్కుటంగా ఉన్న జమాత్-ఎ-ఇస్లామీ నాయకులని, వారికి పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది సర్వజన విదితమేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 'అవామీ లీగ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం, ఎన్నికల వాగ్దానాన్ని అమలు పరచాలన్న పార్టీ దృఢ సంకల్పం జమాత్ నాయకులను కలవరపరిచాయి. ప్రభుత్వ దృష్టి త్వరలోనే తమపై పడ్డగలదని వారు గ్రహించారు' అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 28 February, 2009
|