సిగ్గు... సిగ్గు!
(వరప్రసాద్ గాలిదేవర)
హైదరాబాద్ : రాజకీయాలు దిగజారి పోయాయని గగ్గోలు పెట్టే సంస్కరవాదుల గొంతులు ఒక్కసారిగా మూగపోయాయి. మగ మహా నాయకుల మధ్య సాగుతున్న అవినీతి ఆరోపణలు, కుమారుళ్ళ ప్రస్తావనలు, ఏక వచన ప్రయోగాలు, వ్యక్తిగత విమర్శలను వినే ఈ సంస్కారవాదులు నెత్తీ నోరూ కొట్టేసుకున్నారు. ప్రజల్లో రాజకీయాల గౌరవాన్ని ఈ నాయకులు మంట కలిపేస్తున్నారని, పరువు, పతిష్టలను గంగపాలు చేస్తున్నారని బాధ పడిపోయే ఈ పెద్దలు శుక్రవారం నాటి బూతు పురాణం విని అవాక్కయ్యారు. సభ్యతని మరచిపోయి మహిళా నాయకురాళ్లు వాడిన పదజాలాన్ని వినలేక చెవులు మూసుకున్నారు. తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు సినీనటి రోజా, ప్రజారాజ్యం మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి పరస్పరం తిట్టుకున్న తిట్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాజకీయ, మేధావి, సామాన్య వర్గాలలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. టిఆర్ పి రేటింగ్ ల కోసం ఎలాంటి దృశ్యాలైనా చూపించేస్తాయని అపవాదును మోస్తున్న టెలివిజన్ ఛానళ్ళు కూడా ఈ మహిళా నేతల నోటి వెంట జాలువారిన బూతు పురాణాన్ని ప్రజలకు వినిపించడానికి సిగ్గు పడ్డాయి. ఒక ఛానల్ చూపించి, వినిపించినా మీ పిల్లలు ఈ కార్యక్రమాన్ని చూడకుండా జాగ్రత్త పడండి అంటూ హెచ్చరించింది. మగవాళ్లయినా, మహిళలైనా రాజకీయాలలో సభ్యతను ఏలా వదిలేస్తున్నారో స్పష్టంగా చెప్పవలసిన బాధ్యతను మీడియా చక్కగా సంయమనంతో పోషించింది.
రాజకీయ భాషలో సంస్కార హీనత ప్రవేశించి చాలా కాలం అయింది. మహిళా నాయకులరాళ్ళ వాగ్ధాటికి సమాధానం ఇవ్వలేని సందర్భాలలో పురుష నాయకులు పరుష పదజాలంతో వారి నోటికి తాళం వేయడానికి ప్రయత్నించిన సందర్భాలు కోకొల్లలు. సీనియర్ నాయ.కురాలు నన్నపనేని రాజకుమారిని చేపల పులుసు రాజకుమారి అనడం లాంటి సందర్భాలు ఆ కోవలొకే వస్తాయి. కేవలం మహిళా నాయకురాళ్ళను చిన్న బుచ్చడానికే వ్యక్తగత అంశాలను ప్రస్తావించారు. లక్ష్మీపార్వతి, రేణుకా చౌదరి తదితర నాయకామణులు తగ్గకుండా ధీటుగా సమాధానం ఇచ్చి తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా అన్న చందాన నాయకుల నోళ్ళు మూయించేవారు. అంతే కాదు మహిళా నాయకురాళ్ళపై పరిధులు దాటి మాటలను విసిరిన నాయకులు ప్రజల్లో విమర్శల పాలయ్యేవారు. ఎంతో కొంత గుడ్డిలో మెల్లలా బతుకుతున్న రాజకీయ సభ్యతకు ఈ నవతర రాజకీయ మహిళా మణులు దహన సంస్కారం చేసేశారన్నదే ఇప్పుడు అందరి బాధ.
Pages: 1 -2- News Posted: 28 February, 2009
|