స్వామీ! ఇంత పక్షపాతమా?
న్యూఢిల్లీ: 'భారతీయ జనతా పార్టీ (బిజెపి) కోరింది' కనుక తన సహచరుడు నవీన్ చావ్లాను తొలగించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎన్.గోపాలస్వామి సిఫార్సు చేశారని ప్రభుత్వం ఆరోపించింది. ఎన్నికల కమిషన్ లో 'పరస్పర అపనమ్మకాన్ని' అనుమతించినందుకు సిఇసిని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ తన 20 పేజీల 'కాన్ఫిడెన్షల్ పత్రం'లో తీవ్రంగా దుయ్యబట్టింది. చావ్లాను తొలగించాలన్న గోపాలస్వామి సిఫార్సును న్యాయ మంత్రిత్వశాఖ లేఖ ఆధారంగానే రాష్ట్రపతి తిరస్కరించారు.
'చావ్లాను ఎన్నికల కమిషనర్ గా నియమించిన రోజు నుంచే వైమనస్యాలు కొనసాగినట్లు కనిపిస్తున్నది. పరస్పర అపనమ్మకాన్ని సిఇసి పెరగనిచ్చారు. చావ్లా తొలగింపునకు ప్రాతిపదికను సృష్టించేందుకు పరిస్థితిని అవకాశంగా తీసుకున్నారు. బిజెపి కోరుకున్నదిదే' అని మంత్రిత్వశాఖ తన లేఖలో పేర్కొన్నది. కేవలం 'అంతర్గత కలహాల' ఆధారంగా ఏకపక్షంగా చర్య తీసుకున్నందుకు గోపాలస్వామిని మంత్రిత్వశాఖ తీవ్రంగా విమర్శించింది. ఆయన సిఫార్సును పరిగణనలోకి తీసుకోవాలని తాము నిర్ణయించినట్లయితే, కమిషన్ కార్యక్రమాలకు తీవ్రంగా అంతరాయం కలిగి ఉండేదని మంత్రిత్వశాఖ పేర్కొన్నది.
Pages: 1 -2- News Posted: 3 March, 2009
|