బిజెపిలో మరో 'వార్'రూమ్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అశోకా రోడ్ లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి)కేంద్ర కార్యాలయంలో ఎన్నికల 'వార్ రూమ్'ఏర్పాటైంది.సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వ్యూహరచన,విధివిధానాల అమలు కోసమే ఈ తాజా కేంద్రం ఏర్పాటై ఉండవచ్చు. అయితే,పార్టీలో తమ స్థాయిని తగ్గించారని బాధ పడుతున్న నాయకులను బుజ్జగించడమే ఈ రెండవ 'వార్ రూమ్' ఏర్పాటుకు అసలు కారణమై ఉండవచ్చు. ఇప్పటికే బిజెపి మొదటి 'వార్ రూమ్' మరొక చోట పని చేస్తున్నది. ఎల్.కె. అద్వానీ వ్యక్తిగత సహాయకులు దానిని నిర్వహిస్తున్నారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి అద్వానీ క్రితం నెల పార్టీ కేంద్ర ఎన్నికల కార్యాలయాన్ని మూసివేసి, వేర్వేరు నాయకులకు ఆయా రాష్ట్రాల బాధ్యతలను అప్పగించినట తరువాత వెంకయ్య నాయుడు, ముఖ్తార్ అబ్బాస్ నక్వి, జశ్వంత్ సింగ్, అనంత కుమార్ ప్రభృతులు తమ హోదా తగ్గించారని కుందుతున్నట్లు బిజెపి వర్గాలు తెలియజేశాయి. రాజనాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషి స్వయంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నందున, తమ సొంత ఎన్నికల సన్నాహాలలో నిమగ్నమై ఉన్నందున వారికి కేంద్ర ఎన్నికల కార్యాలయం లేని లోటు కనిపించడం లేదు. కాని వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వంటి ఇతర నాయకులు తమకు మేనేజర్ పాత్ర లేకపోవడం పట్ల అసంతుష్టి చెందుతున్నారు. గత సంవత్సర కాలంగా ఆ నాయకులు కేంద్ర కార్యాలయంలో నుంచే ఎన్నికల కోసం పాటు పడుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించిన వెంకయ్య నాయుడు కర్నాటకలో తప్పిస్తే ఏ ఇతర దక్షిణాది రాష్ట్రంలోనూ బిజెపికి లాభించేది అంతగా ఏదీ లేనందున తనను కించపరిచారని భావిస్తున్నారు. ఇక కర్నాటకలో ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్యూరప్ప ఇతరుల జోక్యాన్నిఏమాత్రం సహించరు. గడచిన నెల రోజులలో జైట్లీ తిరిగి కేంద్ర ఎన్నికల కార్యాలయం బాధ్యతను నిర్వర్తించేందుకు అద్వానీ అనుమతించినట్లు పార్టీ గ్రహించిన తరువాత ఈ అసమ్మతి మరింత తీవ్రమైంది.
Pages: 1 -2- News Posted: 5 March, 2009
|