నానో బుకింగ్ ధర 70 వేలు!
ముంబై: లక్ష రూపాయల ధరతో మార్కెట్లోకి రానున్న టాటా నానో కారును బుక్ చేసుకోదలచిన వారు ముందుగా 70 వేల రూపాయలు బుకింగ్ చార్జీ చెల్లించాలి. నానో కార్ల కొనుగోలుదార్లకు ఫైనాన్స్ సౌకర్యాన్ని అందించేందుకు బ్యాంకులతో సహా పలు ఫైనాన్స్ సంస్థలతో టాటా మోటార్స్ సంస్థ సంప్రదిస్తోంది. నానో కార్లకు బ్లాక్ మార్కెట్ ను అరికట్టే ఉద్దేశ్యంతో కొనుగోలుదారులు బుకింగ్ ధరగా అధిక మొత్తాన్ని చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. మార్చ్ 23 తేదిన నానో కారును వాణిజ్య పరంగా విడుదల చేస్తారు. ఆ రోజు నుండి బుకింగ్ లు ప్రారంభమై ఒక నెల రోజుల గడువుతో ముగుస్తాయని ప్రభుత్వ రంగ బ్యాంకుల సీనియర్ అధికారులు వెల్లడించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ఏకైక నానో కార్ల బుకింగ్ ఏజెంట్ గా నిలుస్తుంది. నానో కారును కొనుగోలు చేసేందుకు బుకింగ్ మొత్తంతో పాటుగా రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలను చెల్లించవలసి ఉంటుంది. ఈ మొత్తాలను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలోను లేదా పైనాన్స్ చేస్తున్న సదరు బ్యాంకు పే ఆర్డర్ రూపంలోను చెల్లించాలి. బేసిక్, డీలక్స్, లక్సరీ- అనే రకాల నానో కార్లను మార్కెట్ లో విడుదల చేయనున్నారు. వాటిలో బేసిక్ నానో ధర 1.20 లక్షల రూపాయలుంటుంది. పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషన్ లాంటి సదుపాయాలున్న డీలక్స్ నానో 1.40 లక్షలు, లక్సరీ నానోల ధర 1.60 లక్షల రూపాయలుగా ఉండొచ్చు.
గత ఏడాది జనవరిలో నానో మాతృకను రతన్ టాటా విడుదల చేస్తున్న సమయంలో డీలర్ స్థాయిలో నానో ధర ఒక లక్ష రూపాయలుగా ఉంటుందని వెల్లడించారు. వ్యాట్, ట్రాన్స్ పోర్టు చార్జీలను కలుపుకుంటే 1.20 నుండి 1.25 లక్ష రూపాయలుగా ధర పలుకుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. బుకింగ్స్ భారీగా ఉంటే గడువుకు ముందే బకింగ్ లను మూసివేసే అవకాశముందని బ్యాంకర్లు చెబుతున్నారు. టాటా మోటార్స్ హీన పక్షం 6 లక్షల బుకింగులను ఊహిస్తోంది. తొలి సంవత్సరంలో ఒక లక్ష కార్లను మాత్రమే ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. దాంతో నానో కార్ల బుకింగ్ చేసుకున్న తర్వాత వినియోగదార్లకు చేరేందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. బుకింగుల సంఖ్యను బట్టి మూడు నాలుగు నెలల కాలం పట్టొచ్చు. నానో పైనాన్సింగ్ స్కీమ్ ను రూపొందించడంపై బ్యాంకర్లు కుస్తీ పడుతున్నారు.
Pages: 1 -2- News Posted: 5 March, 2009
|