కసబ్ కోసం 2కోట్లతో టన్నెల్!
ముంబై: ముంబైలోని అత్యధిక భద్రత గల జైలులో భూగర్భంలో కనివినీ ఎరుగని రూ. 2 కోట్ల ప్రాజెక్టు కోసం 250 మంది శ్రామికులు రాత్రింబవళ్లూ పని చేస్తూ, దానిని వచ్చే మూడు వారాలలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థర్ రోడ్ జైలు సెల్ ను అనుసంధానించే 20 అడుగుల పొడవైన, బాంబు, బుల్లెట్ నిరోధక సొరంగాన్ని నిర్మించడం వారి లక్ష్యం. నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాదుల దాడులలో సజీవంగా పట్టుబడిన ఏకైక టెర్రరిస్టు అజ్మల్ కసబ్ ను అతనిపై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగినంత కాలం ఇదే సెల్ లో ఒంటరిగా నిర్బంధంలో ఉంచుతారు. అయితే, ఈ సెల్ ఇప్పటికే ఉంది. కాని వచ్చే మూడు వారాలలో దీనిని బాంబు దాడిని తట్టుకోగలిగినదిగా తీర్చిదిద్దుతారు.
కసబ్ క్షేమంగా, సజీవంగా ఉండాలని ఇండియా ఎంతగా కోరుకుంటోందో, ఇది వరకెన్నడూ లేనంత దారుణంగా ముంబై నగరాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఆ దాడులపై దర్యాప్తులో అతనిపై సాగే విచారణ కూడా అంతగానూ కీలకమైనది. ఒక నిందితుని అతని జైలు సెల్ నుంచి కోర్టుకు సురక్షితంగా తీసుకువెళ్ళి తిరిగి తీసుకురావడం కోసం ఒక సొరంగాన్ని మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. కోర్టును, కసబ్ సెల్ ను ఇనుప కవచాలతో మరింత పటిష్ఠం చేస్తున్నారు. ప్రత్యేక సెల్ కు, కోర్టుకు, సొరంగానికి సెంట్రల్ ఎయిర్ కండిషన్ సౌకర్యం కలిగిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది.
సొరంగం మార్గం పొడుగునా వివిధ చోట్ల నిఘా కెమెరాలను అమరుస్తారు. సాయుధ రక్షకుల పటాలాలు ఈ ప్రాంగణాన్ని కాపలా కాస్తాయి. జైలులో ఒక రాతి గోడకు అటూ ఇటూ రెండు సెక్షన్లు ఉంటాయి. ఒకదానిలో ఖైదీల కోసం 10 బ్యారక్ లు ఉన్నాయి. మరొక సెక్షన్ లో రెండు బ్యారక్ లు ఉన్నాయి. వాటిని 1993 ముంబై పేలుళ్ళపై దర్యాప్తు జరిపిన ప్రత్యేక టాడా కోర్టు కోసం, దాని సెక్రటేరియట్ కోసం ఉద్దేశించారు. కసబ్ కొత్త సెల్ ఈ సెక్షన్ లోనే ఉన్నది. టాడా కోర్టును వేరే చోటికి తరలించారు. ఈ బ్యారక్ లను ఈ విచారణ కోసం ప్రత్యేక కోర్టుగా మార్చారు.
Pages: 1 -2- News Posted: 6 March, 2009
|